వారం రోజుల వ్యవధిలో.. ఐటీ అధికారులు వాసవి, ఫినీక్స్ సంస్థలపై దాడులు జరిపాయి. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో.. రియల్ రంగంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కు చేరువగా ఉండే సంస్థల మీదే ఐటీ విభాగం దాడులు చేస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ తర్వాతి టార్గెట్ ఏయే సంస్థలపై ఉంటుందనే అంశంలో హైదరాబాద్ రియల్ రంగంలో జోరుగా చర్చ జరుగుతోంది.
జూబ్లీహిల్స్ కేంద్రంగా పని చేస్తున్న రెండు నిర్మాణ సంస్థలు మంత్రి కేటీఆర్‌తో సన్నిహితంగా వ్యవహరిస్తానే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఒక కంపెనీ అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట్.. ఇలా వివిధ ప్రాంతాల్లో నివాస, వాణిజ్య సముదాయాల్ని చేపట్టింది. కేటీఆర్ తో అతి సన్నిహితుడైన బిల్డర్ ఖైరతాబాద్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరిందని సమాచారం. ఈ రెండు సంస్థలతో పాటు మాదాపూర్‌లో లగ్జరీ నిర్మాణాల్ని కడుతున్న కంపెనీయే తదుపరి లక్ష్యం కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు నగరంలో ప్రీలాంచుల్లో నేరుగా నగదు తీసుకున్న సంస్థల వివరాల్ని ఐటీ విభాగం ఆరా తీస్తోందని సమాచారం. ముఖ్యంగా రాజకీయ ప్రమేయం ఉన్న రియల్ సంస్థల మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. మరో నిర్మాణ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మా కార్యకలాపాల్ని నిర్వహిస్తుండటం.. ఆయా సంస్థకు ప్రభుత్వం అండదండలు ఉండటం వల్లే ఐటీ విభాగం దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఫినీక్స్‌కు ముందే తెలుసా?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. భారత ప్రధాని నరేంద్రమోడీపై మాటల యుద్ధం ప్రకటించడం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయనే విషయం ప్రజలకు అర్థమైంది. అయితే, ఐటీ దాడులు జరుగుతాయనే విషయం ఫినీక్స్ సంస్థకు ముందే సమాచారం లభించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 19న సంస్థ అట్టహాసంగా జరిగిన ఫినీక్స్ ఛైర్మన్ చుక్కపల్లి సురేష్ 60వ జన్మదిన వేడుకల్లో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ ఉన్నతాధికారులు పాల్గొన్నారని తెలిసింది. అదే రోజు ఐటీ దాడుల గురించి పక్కా సమాచారం అందిందని సమాచారం. అందుకే ఐటీ విభాగానికి దొరక్కుండా ఈ సంస్థ.. అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకుందనే చర్చ రియల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరి వాసవి, ఫినీక్స్‌ల నుంచి ఎంత మొత్తం నల్లధనం పట్టుబడిందనే విషయం అధికారికంగా తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.