మీరు షాపింగ్ కోసం వెళ్లినప్పుడు పార్కింగ్ వద్ద కొందరు యువకులు బ్రోచర్లను పంచడాన్ని మనం చూస్తాం. సూపర్ మార్కెట్‌కు వెళ్లినా.. బ్యాంకులు, ఏటీఎంలు.. ఇలా రద్దీగా ఉన్న ప్రతి ప్రాంతంలో కొందరు ఏజెంట్లు.. వివిధ రియల్ ఎస్టేట్ వెంచర్ల బ్రోచర్లను పట్టుకుని ప్లాట్లను విక్రయించేందుకు ప్రయత్నం చేయడాన్ని కళ్లారా చూస్తాం. అయితే, వీటిలో అధిక శాతం ఏజెంట్లు రెరా అనుమతి లేని వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని రెరా దృష్టికొచ్చింది. మీతో కూడా ఎవరైనా వెంచర్ల వివరాల్ని చెప్పేందుకు ప్రయత్నిస్తే.. అది రెరా ప్రాజెక్టా? కాదా? అనే అంశాన్ని పరిశీలించండి. రెరా అనుమతి లేని వెంచర్లను ఎవరూ ప్రమోట్ చేస్తున్నా.. వెంటనే వారి వివరాలను రెజ్ న్యూస్ వాట్సప్ నెంబరుకు పంపించండి. ఆయా ఏజెంట్లు, ప్రాజెక్టుల సమాచారం మేం రెరా అథారిటీ దృష్టికి తీసుకెళతాం. ఎందుకో తెలుసా?
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రియల్ సంస్థలు కొనుగోలుదారుల్ని బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రీలాంచ్ పేరిట రేటు తక్కువ అంటూ ఏజెంట్లను ఇంటింటికి పంపిస్తూ.. మాయమాటలు చెబుతూ.. ప్లాట్లను విక్రయిస్తున్నాయి. ఇది నిజమేనని నమ్మి.. అందులో కొంటే.. ఎలాంటి సమస్యలు రావని గుడ్డిగా నమ్మేసి.. కొందరు బయ్యర్లు కొంటున్నారు. అలా కొని మోసపోయిన వారు, ప్రస్తుతం రెరా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కాబట్టి, ఇక నుంచి ప్లాట్లు అమ్ముతామంటూ ఎవరు బ్రోచర్ తెచ్చినా.. ఏదైనా ఒక వెంచర్ వివరాల్ని పంపించినా మీరు తుది నిర్ణయం తీసుకోవద్దు. కేవలం రెరా ప్రాజెక్టుల్లో కొంటేనే మీ పెట్టుబడికి సంపూర్ణ రక్షణ ఉంటుంది. ఇలాంటి ఏజెంట్లు, సంస్థలను దారిలోకి తెచ్చేందుకు తెలంగాణ రెరా అథారిటీ దృష్టి సారించింది.
రెరా ఏం చెబుతోంది?
తెలంగాణ రెరా వద్ద నమోదు చేసుకున్న ప్రాజెక్టులు లేదా వెంచర్లలో మాత్రమే రెరాలో నమోదైన ఏజెంట్లు అమ్మకాల్ని జరపాలి. రెరాలో నమోదైన ఏజెంట్లు రెరా అనుమతి లేని వెంచర్లలో అమ్మకాల్ని చేపట్టకూడదు. హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో ఎవరైనా ఏజెంట్లు.. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. వారిపై తెలంగాణ రెరా అథారిటీ కఠిన చర్యల్ని తీసుకుంటుంది. జరిమానా కూడా విధిస్తుందనే విషయం మర్చిపోవద్దు.
ఇంకెందుకు ఆలస్యం?
రెరాలో నమోదు కానీ ప్రాజెక్టులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అమ్ముతున్నట్లు మీకు తెలిస్తే.. వెంటనే 9030034591కి సమాచారం వాట్సప్ చేయండి. లేదా రెజ్‌న్యూస్21@జిమెయిల్.కామ్‌కి మెయిల్ చేయండి. ఆయా వివరాల్ని మేం రెరా కార్యాలయానికి అందజేస్తాం.