poulomi avante poulomi avante

మంత్రి సంస్థ‌ను చూసి.. మ‌న‌మేం నేర్చుకోవాలి?

Hyderabad Builders Should Learn From Bangalore Mantri..

బెంగ‌ళూరుకు చెందిన మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ ప్ర‌మోట‌ర్‌, డైరెక్ట‌ర్ సుశీల్ మంత్రిని సీఐడీ విభాగం తాజాగా అరెస్టు చేసింది. ఇళ్ల కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదుల నేప‌థ్యంలో కంపెనీలో భాగ‌స్వామి అయిన అత‌ని కుమారుడు ప్ర‌తీక్ మంత్రిని కూడా క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి అరెస్టు చేసిన త‌ర్వాత ఇద్ద‌రినీ మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రిచారు. అనంత‌రం జ్యుడీషియ‌ల్ కస్ట‌డికి పంపారు. మార్చి 2020, ఆగ‌స్టు 2020లో క‌బ్బ‌న్ పార్క్ పోలీసు స్టేష‌న్‌లో ఇద్ద‌రి మీద రెండు చీటింగ్ కేసుల ఆధారంగా తాజా అరెస్టు జ‌రిగింది. త‌ర్వాత ఈ కేసును సీఐడీ విభాగానికి బ‌దిలీ చేశారు. క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌ని డిపాజిట్ ప‌థ‌కాల నిషేధం (BUDS) చ‌ట్టంతో పాటు ఐపీసీ సెక్ష‌న్ 420 కింద ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాలి!
మంత్రి డెవ‌ల‌ప‌ర్స్ అంటే అంద‌రికీ హైరైజ్ నిర్మాణాలు, ల‌గ్జ‌రీ విల్లాలు, వాణిజ్య స‌ముదాయాలే గుర్తుకొస్తాయి. బెంగ‌ళూరుతో పాటు హైద‌రాబాద్‌లోనూ ప‌లు నిర్మాణాల్ని చేప‌ట్టింది. అయితే ఇదంతా నాణానికి ఒక‌వైపే.

మ‌రోవైపు.. ఇదే మంత్రి సంస్థ గ‌త కొన్నేళ్ల నుంచి ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫ్లాట్ల ఆఫర్లు, త‌ప్పుదోవ ప‌ట్టించే బ్రోచ‌ర్లు, న‌కిలీ ప‌థ‌కాల‌తో అనేక బ‌య్య‌ర్ల‌ను మోసం చేసింది. వారి క‌ల‌ల గృహాన్ని స‌కాలంలో అందించ‌క నానా ఇబ్బందుల‌కు గురి చేసింది.

ఈ సంస్థ అత్యాశ‌కు పోయి.. ఏక‌కాలంలో అనేక ప్రాజెక్టుల‌ను చేప‌ట్టి.. వాటిని పూర్తి చేయ‌డానికి కావాల్సిన సొమ్ము కోసం మోస‌పూరిత ప‌థ‌కాల్ని ప్ర‌వేశ‌పెట్టి.. జ‌నాల నుంచి కోట్లాది రూపాయ‌ల్ని వ‌సూలు చేసి.. దారుణంగా వంచించింది.

అందుకే, కొన్నేళ్ల నుంచి నిర్మించుకున్న నిర్మాణ సామ్రాజ్యం ఒక్క‌సారిగా క‌ళ్ల ముందే కుప్ప‌కూలిపోయింది. నిన్న‌టివ‌ర‌కూ ఒక వెలుగు వెలిగిన ఈ డెవ‌ల‌ప‌ర్ జైలులో చిప్ప‌కూడు తినే దుస్థితికి చేరుకున్నారు.

ఇప్ప‌టికైనా, హైదరాబాద్‌కు చెందిన డెవ‌ల‌పర్లు మంత్రి డెవ‌ల‌ప‌ర్స్‌ని చూసి గుణ‌పాఠం నేర్చుకోవాలి. త‌మ స్థోమ‌త‌ను మ‌ర్చిపోయి.. అత్యాశ‌కు పోయి.. ఏదో అద్భుతం చేద్దామ‌ని భావించి.. ఎట్టి ప‌రిస్థితిలో త‌ప్ప‌ట‌డుగులు వేయ‌కూడ‌దు.

తోటోడు తొడ కోసుకుంటున్నాడ‌ని.. మ‌నం మెడ కోసుకునే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌దు. ఇక్క‌డ ఎవ‌రి వ్యాపారం వారిదే. ఎవ‌రి ప‌ద్ధ‌తి వారిదే. ఒక‌రికొక‌రు పోటీగా భావించ‌కుండా.. ప‌రువు పోగొట్టుకుని రియ‌ల్ వ్యాపారం చేయ‌కూడ‌దు.

ఒకవైపు మాన‌సిక ఆందోళ‌న‌.. మ‌రోవైపు ప్ర‌తిరోజూ ఏదో ఒక స‌మ‌స్య‌.. అటు వెండ‌ర్ల‌ను ఇటు బ‌య్య‌ర్ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. నిర్మాణ సిబ్బందితో ప‌ని చేయించ‌డం.. స‌కాలంలో అంద‌రికీ చెల్లింపులు చేయ‌డం అంత సులువేం కాదు.

ఇలాంటి కష్టం ఎంత‌యినా ప‌డొచ్చు కానీ.. పోలీసు స్టేష‌న్ల‌కెక్కీ.. జైలులో చిప్ప‌కూడు తిని.. స‌మాజంలో ఉన్న ప‌రువును పోగొట్టుకుని.. ఒక మోస‌గాడిగా స‌మాజంలో ముద్ర వేయించుకుని జీవ‌చ్చ‌వంలా బ్ర‌త‌క‌డం అవ‌స‌ర‌మా?

డెవ‌ల‌ప‌ర్లు ఇప్ప‌టికైనా తెలివిగా వ్య‌వ‌హ‌రించాలి. నొయిడా, గుర్గావ్‌, ముంబై, బెంగ‌ళూరులో కొంద‌రు బిల్డ‌ర్ల‌ను చూసైన త‌మ పంథాను మార్చుకోవాలి. అలాంటి దుర్భ‌ర జీవితాన్ని వ‌ద్దునుకుని.. ఉన్న‌దాంట్లో ద‌ర్జాగా బ్ర‌త‌క‌డం నేర్చుకోవాలి.

ఇందుకోసం ఏం చేయాలి? అత్యాశ‌కు పోకుండా.. గాలిలో మేడ‌లు క‌ట్ట‌కుండా.. ఆక‌ర్ష‌ణీయ‌మైన ప‌థ‌కాల‌తో కొనుగోలుదారుల్నుంచి సొమ్ము వ‌సూలు చేయ‌కుండా.. మోస‌పూరిత ప‌థ‌కాల్ని ఆరంభించ‌కుండా అడుగులు ముందుకేయాలి. మార్కెట్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే గాలి మేడలు కట్టేవారు మార్కెట్ నుంచి గాయబ్ అయిపోతారు. వారి వద్ద కొన్నవాళ్లూ ఇబ్బంది పడక తప్పదు. కానీ, నిబద్ధతతో నిర్మాణాల్ని చేపట్టేవారు ఎప్పటికీ కింద పడిపోరనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి, మంత్రి సంస్థ తప్పటడుగులు వేసినట్లుగా కాకుండా.. ఓ పద్ధతి ప్రకారం నిర్మాణాల్ని చేపట్టేవారే రియల్ రంగంలో నిలబడతారని మర్చిపోవద్దు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles