- ఒక్క ఫ్లాటు అమ్మితే విదేశీ టూర్..
- ఐదు ప్లాట్లు అమ్మితే బడా కారు ఫ్రీ..
- పది ఫ్లాట్లు అమ్మితే ఫ్లాటు ఉచితం..
కరోనా తర్వాత హైదరాబాద్ రియల్ రంగం మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్థాయికి దిగజారిపోయింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మేస్త్రీలు, ఇంటీరియర్ డెకొరేటర్లు, కొందరు స్థలయజమానులు.. ఇలా ఎవరు పడితే వారు.. నిర్మాణాల్లో అనుభవం లేనివారూ నిర్మాణ రంగంలోకి రంగప్రవేశం చేసి.. ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయిస్తూ.. ప్రజల చెవిలో పూవులు పెడుతున్నారు. మార్కెట్ రేటు కంటే తక్కువకు ఫ్లాటు వస్తుందంటే చాలు.. బయ్యర్లు కూడా వీరి చేతిలోనే సొమ్ము పోస్తున్నారు. నాలుగైదేళ్ల తర్వాత ఫ్లాటు చేతికొస్తుందిలే అంటూ పగటి కలలు కంటున్నారు. ఈ క్రమంలో బిల్డర్లుగా అవతారం ఎత్తిన కొందరు వ్యక్తులు.. మల్టీలెవెల్ మార్కెటింగ్ తరహాలో ఫ్లాట్లను విక్రయిస్తుండటం దారుణమైన విషయం.
ఒక చోట స్థలం తీసుకోవడం.. దాన్ని ప్రీలాంచులో విక్రయించడం.. వచ్చిన సొమ్మును తలా కొందరు పంచుకోవడం.. పంపకాల్లో తేడా వస్తే పోలీసు స్టేషన్లో కేసులు పెట్టడం.. కోర్టుకెక్కడం.. వంటివి నిత్యకృత్యంగా మారాయి. ముఖ్యంగా, కరోనా తర్వాత హైదరాబాద్లో ప్రీలాంచ్ మోసాలు మరీ పెరిగిపోయాయి. ఎక్కువగా శివారు ప్రాంతాల్లోనే దర్శనమిస్తున్నాయి. నిన్నటివరకూ కొల్లూరు, వెలిమల, పాటి, ఘనపూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించిన ఈ మోసగాళ్లు కొంతకాలం నుంచి పటాన్చెరు, ఇస్నాపూర్, రుద్రారంలోకి అడుగుపెట్టారు.
మరికొందరేమో అక్కడ్నుంచి ఏకంగా బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్లోనూ సరికొత్త ప్రీలాంచ్ మోసాలకు తెరలేపారు. రామోజీ ఫిలిం సిటీ, ఆదిభట్ల, మహేశ్వరంలోనూ మార్కెట్ రేటు కంటే తక్కువకే విక్రయించే మాయగాళ్లు అడుగుపెట్టారు. మొత్తానికి, అసలు నగర నిర్మాణ రంగం ఎటువైపు పయనిస్తోంది? నిన్నటి వరకూ పారదర్శకంగా.. ఒక పద్ధతిగా వ్యవహరించే రియల్ రంగం ఎందుకింత హీనస్థితికి దిగజారిందో నిర్మాణ సంఘాలే నిగ్గు తేల్చాలి.