- కొనుగోలుదారులకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సూచన
ఆమ్రపాలి ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసినవారంతా కలిసి అడ్ హక్ అసోసియేషన్ గా ఏర్పడి ఆయా ప్రాజెక్టుల నిర్వహణ చూసుకోవాలని సుప్రీంకోర్టు నియమించిన ఆమ్రపాలి నిలిచిపోయిన ప్రాజెక్టుల పునర్నిర్మాణ సంస్థ (ఏస్పైర్) సూచించింది. సుప్రీం తీర్పు మేరకు నిలిచిపోయిన ఆమ్రపాలి ప్రాజెక్టులను ఎన్ బీసీసీ ఇండియా లిమిటెడ్ తో కలిసి ఏస్పైర్ పునర్నిర్మిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను అటు కాంట్రాక్టర్, ఇటు ఎన్ బీసీసీ నిర్వహించే పరిస్థితి లేనందున ఆ బాధ్యతలను అపార్ట్ మెంట్ యజమానులే చూసుకోవాలని కోరింది. ‘సదరు ప్రాజెక్టులో నివసించేవారితో కూడిన సంఘం ప్రతినిధులను అడ్ హక్ అసోసియేషన్ గా గుర్తించాలని కమిటీ నిర్ణయించింది. సదరు ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహణ ఇతరత్రా అంశాలను ఆ అసోసియేషన్ చూసుకోవాలి’ అని పేర్కొంది. కాగా, ఆమ్రపాలికి సంబంధించి 20కి పైగా నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో 41 వేల యూనిట్లు విక్రయం కాగా.. 5వేలకు పైగా యూనిట్లు అమ్ముడవలేదు. ఈ మొత్తం యూనిట్లను పూర్తి చేసి 2024 జూన్ కల్లా ఇచ్చేలా ఎన్ బీసీసీ ప్రణాళిక సిద్ధం చేసింది.