దేశంలోని అనేక రాష్ట్రాలు కొవిడ్ – 19 సంబంధిత ఆంక్షల్ని సడలించడంతో నిర్మాణ రంగం జూన్ మధ్య నాటికి కార్యకలాపాల్ని తిరిగి ప్రారంభిస్తుందని అసోచామ్ వెల్లడించింది. దాదాపు నలభై నుంచి యాభై రోజుల విరామం తర్వాత, కాంట్రాక్టర్లు నిర్మాణ స్థలాల వద్ద పని చేస్తారని.. కార్మిక శక్తి కూడా తిరిగి పనుల్లోకి చేరుతుందని అంచనా వేసింది. లాక్ డౌన్ సమయంలో ఉత్తర ప్రదేశ్, బీహార్ మరియు రాజస్థాన్లలోని వారి స్వస్థలాలకు వెళ్లిన నిర్మాణ కార్మికులు తిరిగి వెనక్కి తీసుకురావడం సవాలుతో కూడుకున్న అంశమని తెలియజేసింది.
భవన నిర్మాణ కార్మికులకు వేగంగా టీకాలు వేస్తే, వారికి మరియు వారి కుటుంబాలకు ధైర్యంగా ఉంటుందని తెలిపింది. వ్యాక్సిన్ ద్వారా పెద్ద నగరాలకు తిరిగి రావాలని కోరుకునే వలస కూలీలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. నిర్మాణ కార్మికులకు ప్రత్యేక వ్యాక్సిన్ కేటాయింపులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని పేర్కొంది. మధ్యస్త స్థాయి కాంట్రాక్టర్లకు అత్యవసరంగా పని మూలధన మద్దతు అవసరమని, వీరికి బ్యాంకులు తమ సాయాన్ని అందజేయాలని అసోచామ్ కోరింది.