* కోకాపేట్లో ప్రెస్టీజ్ క్లెయిర్మోంట్
* డిసెంబరు 10 నుంచి ప్రీలాంచ్ అమ్మకాలు
* ఇంత బడా సంస్థే ఇలా అమ్మవచ్చా?
* తెలంగాణ రెరా అథారిటీ నిద్రపోతుందా?
(కింగ్ జాన్సన్ కొయ్యడ)
హైదరాబాద్‌లో చిన్నాచితకా బిల్డర్లే కాదు.. బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ సైతం ప్రీలాంచ్ బాట పట్టింది. రెరా అథారిటీ అనుమతి తీసుకోకుండానే.. ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయించడం ఆరంభించింది. అయినా, ప్రెస్టీజ్ వంటి బడా నిర్మాణ సంస్థకు ఇంత కక్కుర్తి ఏమిటో అర్థం కావట్లేదని నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. హెచ్ఎండీఏ అనుమతి లభించాక మహా అయితే ఒకట్రెండు నెలల్లో రెరా పర్మిషన్ లభిస్తుంది. అప్పటివరకూ వేచి చూడకుండా.. ఈ కంపెనీకి అంత తొందరేమోచ్చిందో అర్థం కావట్లేదు. ప్రెస్టీజ్ ఎస్టేట్స వంటి బడా నిర్మాణ సంస్థలే ఇలా అడ్డదారిలో ఫ్లాట్లను విక్రయించడం విడ్డూరమని కొందరు బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి, ఈ కంపెనీ పేరు చెబితే చాలు.. కొనుగోలుదారులు ఆటోమెటిగ్గా ఫ్లాట్లను కొనేస్తారు. అయినా, ఎందుకీ సంస్థ ఇలా అడ్డదారులు తొక్కతుందో అర్థం కావట్లేదు.
ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కోకాపేట్‌లోని నియోపోలిస్‌లో క్లెయిర్మోంట్ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రెరా అనుమతి తీసుకోకుండానే.. శనివారం నుంచి 3,4 గదుల ఫ్లాట్లను విక్రయానికి పెట్టింది. ఇందులో ఫ్లాట్ ఆరంభ ధర.. సుమారు రూ.కోటిన్నరగా నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో విడుదలైన ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. ఇందులో ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్ల విస్తీర్ణం 2000 చదరపు అడుగులు, ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ల విస్తీర్ణం 2800 చదరపు అడుగుల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. మరి, ప్రెస్టీజ్ వంటి సంస్థే ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయిస్తుంటే.. ఇతర బిల్డర్లు అడ్డదారిలో అమ్మకాలు జరపకుండా ఎలా ఉంటారు? ఇలాంటి బడా సంస్థలకో న్యాయం.. చిన్న కంపెనీలకో న్యాయం ఉండొద్దు కదా! రెరా అనుమతి వచ్చాక సాఫ్ట్ లాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే, నగరానికి చెందిన అనేక రియల్ సంస్థలు రెరా అనుమతి తీసుకున్నాక.. సాఫ్ట్ లాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. మరి, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ మాత్రం ఎందుకిలా అడ్డగోలుగా వ్యవహరిస్తోంది?
* రెరా అనుమతి తీసుకోక ముందే.. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో విక్రయించడం ఎంతవరకూ కరెక్టు? ఈ విషయం తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ గురు ప్రెస్టీజ్ ఎస్టేట్స్ సంస్థ ప్రతినిధి సురేష్ కుమార్‌ని ప్రశ్నించింది. ‘‘శనివారం నుంచి కొనుగోలుదారుల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం. రెరా వచ్చిన తర్వాతే చెక్కులను డిపాజిట్ చేస్తా’’మని అన్నారు. అంటే, ఈ సంస్థ రెరా నిబంధనల్ని కూడా తుంగలో తొక్కేసింది. అసలు రెరా అనుమతి లేకుండా ఫ్లాట్లను విక్రయించకూడదని స్పష్టంగా నిబంధనలు చెబుతుంటే.. కొనుగోలుదారులకు ఫ్లాట్లను విక్రయించి.. అందుకు అడ్వాన్సుగా చెక్కులు తీసుకుని.. రెరా అనుమతి లభించాక ఆ చెక్కులను బ్యాంకులో వేస్తారట. ఇలా నిర్మాణ సంస్థలు వ్యవహరించవచ్చని రెరా నిబంధనల్లో ఎక్కడైనా రాసి ఉందా? రెరా అనుమతి తీసుకోకుండా.. ఇలా అడ్డదారిలో ఫ్లాట్లను బుకింగ్ చేయవచ్చని రెరా నిబంధనలు చెబుతున్నాయా? లేదా నియోపోలిస్‌లో స్థలం కొన్నారు కాబట్టి, ప్రభుత్వమేమైనా ప్రెస్టీజ్ ఎస్టేట్స్‌కు ప్రత్యేక వెసులుబాటును ఇచ్చిందా? కోకాపేట్ నియోపోలిస్‌లో రెరా తీసుకోకుండానే ఫ్లాట్లను అమ్మవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఈ సంస్థకు ప్రత్యేక జీవో ఏమైనా ఇచ్చిందా?
ఛానెల్ పార్ట్నర్లను నియంత్రించలేరా?
ప్రీలాంచ్‌కు సంబంధించి డిజిటల్ మీడియాలో ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రతినిధి రియల్ ఎస్టేట్ గురు ప్రశ్నించగా.. తమకు తెలియకుండా కొందరు ఛానెల్ పార్ట్నర్లు ప్రీలాంచ్‌కు సంబంధించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. అంటే, నగర నిర్మాణ రంగంలో ఛానెల్ పార్ట్నర్లను నియంత్రించలేని దుస్థితికి ప్రెస్టీజ్ ఎస్టేట్స్ వంటి నిర్మాణ సంస్థలు చేరుకున్నాయని దీని బట్టి అర్థమవుతోంది. మరి, ప్రెస్టీజ్ క్లెయిర్‌మెంట్ ప్రాజెక్టు ప్రీలాంచ్.. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వ్యవహారంపై.. తెలంగాణ రెరా అథారిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. బడా సంస్థ కదా అని రెరా అనుమతినిచ్చేసి వదిలేస్తుందా? తమ అనుమతి లేకుండా ప్రీలాంచ్లో ఫ్లాట్లను బుకింగ్ చేసినందుకు జరిమానా విధిస్తుందా?