ఒక సెంటు లే ఔట్లు వేసినందుకు గానూ ఆ వ్యయం నిమిత్తం ప్రభుత్వం.. విశాఖపట్నం మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథార్టీకి 500 ఎకరాల భూమి ఇవ్వనుంది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద విశాఖపట్నం జిల్లాలో 1.4 లక్షల మంది పేదలకు ఇల్లు ఇచ్చేందు జగనన్న హౌసింగ్ కాలనీల పేరుతో వీఎంఆర్డీఏ 81 లేఔట్లు వేసింది. వీటి అభివృద్ధి ఇతర పనుల నిమిత్తం రూ.150 కోట్లు ఖర్చు చేసింది. విశాఖపట్నం జిల్లాలోని పలు చోట్ల మొత్తం 5వేల ఎకరాల్లో ఈ ప్లాట్లు ఉన్నాయి.
తొలుత ప్రభుత్వం వీఎంఆర్డీఏకు రూ.150 కోట్లు మంజూరు చేసింది. అలాగే ఈ పనులు చేసినందుకు గానూ భూమిలో 15 శాతం వాటా వీఎంఆర్డీఏకు ఉంటుంది. అయితే, తమకు ప్రతి లేఔట్ లోనూ 15 శాతం భూమి కాకుండా ఒకేచోట భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇందుకు సర్కారు అంగీకరించింది. భీమిలి మండలంలో 239 ఎకరాలను ఇప్పటికే గుర్తించారు. మిగిలిన భూమి కోసం పరిశీలన జరుపుతున్నారు.