పట్టణ ప్రాంతాల్లో రక్షిత తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన అమృత్ (అటల్ మిషన్ ఫర్ రీజెనువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్) ప్రాజెక్టులను చేపట్టడానికి ఏపీ సర్కారు సుముఖత వ్యక్తంచేసింది. 106 పట్టణ స్థానిక సంస్థల్లో 239 ప్రాజెక్టులు చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్ర పట్ణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది.
దీంతో ఈ 239 ప్రాజెక్టులు చేపట్టడానికి అవసరమైన రూ.3,151 కోట్లకు ఏపీ సర్కారు పరిపాలనా అనుమతులిచ్చింది. ఇందులో రూ.1065 కోట్లు కేంద్రం ఇవ్వనుండగా.. రూ.1189 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రూ.695 కోట్లు ఆయా స్థానిక సంస్థలు వెచ్చిస్తాయి. 12వ ఆర్ధికసంఘం ద్వారా రూ.200 కోట్లు రానున్నాయి. తాగునీటి సరఫరా కోసం రూ.1877.36 కోట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల కోసం రూ.1085 కోట్లు, వాటర్ బాడీస్ రీజెనువేషన్ కోసం రూ,189 కోట్లు వెచ్చించనున్నారు.