హైదరాబాద్ కి చెందిన వాసవి గ్రూప్.. నగరం నలువైపులా కొత్త ప్రాజెక్టుల్ని చేపడుతూ.. సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను సాకారం చేస్తోంది. ప్రధానంగా, బాచుపల్లిలో ఈ సంస్థ అందుబాటు గృహాల ప్రాజెక్టును ఆరంభించి తమ ప్రత్యేకతను చాటుకుంది. ఇక్కడి చుట్టుపక్కల ప్రజలకేం కావాలో అర్థం చేసుకుని.. వారి సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు తోడ్పాటును అందించేందుకే వాసవి అర్బన్ ప్రాజెక్టును ఆరంభించింది. వాస్తవానికి, అఫర్డబుల్ లగ్జరీ ప్రాజెక్టు విభాగంలో ఇంత బడా నిర్మాణం నగరంలో ఇదే ప్రప్రథమం అని చెప్పొచ్చు. ఇదే అంశం సంస్థ ఎండీ యర్రం విజయ్ కుమార్‌కి ఇండియన్ అచీవర్ అవార్డు వచ్చేలా చేసింది.
ఈ సందర్భంగా సంస్థ సీఎండీ యర్రం విజయ్ కుమార్ రెజ్ న్యూస్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఈ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. నిర్ణీత గడువులోపు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను తీర్చే ప్రాజెక్టు కాబట్టి కొనుగోలుదారుల నుంచి చక్కటి ఆదరణ లభిస్తుందని తెలిపారు. మొత్తం 3750 ఫ్లాట్లలో 2400 విక్రయించామని.. పెద్దగా స్టాకు లేకపోవడంతో నెలకు యాభై, అరవై ఫ్లాట్లను అమ్ముతున్నాయని వెల్లడించారు. మిగతా ఫ్లాట్లను విక్రయించేందుకు ఆరంభించిన స్కీముకుమంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. కొన్ని టవర్ల నిర్మాణం పూర్తయ్యిందని.. 2024 డిసెంబరు కల్లా వాసవి అర్బన్‌ను పూర్తి చేస్తామని ప్రకటించారు.
నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అవార్డు!
ఇటీవల బుధవారం న్యూ ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. భారత నిర్మాణ మరియు రియల్ రంగంలో విశిష్ఠమైన సేవల్ని అందిస్తూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందుబాటు గృహాల ప్రాజెక్టును చేపట్టినందుకు గాను ఆయనకీ అవార్డు లభించింది.