గత పదేళ్లలో భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ చక్కటి పురోగతి సాధించింది. ఇందులో ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) గణనీయమైన పాత్ర పోషించారు. హైబ్రిడ్ పని విధానం నేపథ్యంలో చాలా మంది ఎన్నారైలు భారత్ లో ఇల్లు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వదేశంలో ఉన్నత స్థాయి ప్రమాణాలతో జీవించాలనే ఆకాంక్ష వారిని భారత్ లో పెట్టుబడులకు ప్రోత్సహిస్తోంది. ఎన్నారైలు భారత్ లో ఇళ్లు కొనుగోలు చేస్తే.. దేశీయంగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.
ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ పెట్టుబడిదారులు ముఖ్యమైన నిధుల వనరుగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నారైలు రియల్ ఎస్టేట్ పరిశ్రమలో సులభంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. తద్వారా వేగవంతంగా విస్తరిస్తున్న రియల్ పరిశ్రమ నుంచి ప్రయోజనాలు పొందవచ్చు. ప్రపంచ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రూపాయి కాస్త ఒడుదొడుకులకు లోనవుతోంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థికంగా సురక్షితంగా ఉండాలని చాలా మంది ఎన్నారైలు భావిస్తున్నారు. ఈ అంశమే భారత్ లో ఇళ్లకు డిమాండ్ పెంచింది.
వాస్తవానికి రూపాయి పతనం వల్ల ఎన్నారైలు లాభపడతారు. ముఖ్యంగా బలమైన కరెన్సీ దేశాల్లో ఉన్నవారికి ఇది మరింత లాభదాయకంగా ఉంటుంది. మరోవైపు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించే పెట్టుబడులకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఎన్నారైలు రెండో ఇంటికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. వీకెండ్ హోమ్స్ హవా బాగా కొనసాగుతోంది. అంతేకాకుండా ఎన్నారైలు భారత్ లో రియల్ ఎస్టేట్ పెట్టుబడిని లాభదాయకంగా అవకాశంగా పరిగణిస్తున్నారు. అది వారి ఆదాయాన్ని పెంచడమే కాకుండా వారి పోర్టిఫోలియోను వైవిధ్యం చేయడంలో సహాయపడుతుంది.
అమెరికా, కెనడా, మధ్య ప్రాచ్య, యూరప్, ఇతర ఆసియా దేశాలలో ఉన్నవారు గుర్గావ్, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇక టైర్-2 నగరాలతో పాటు, తమ స్వస్థలాల్లో సైతం ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా నేపథ్యంలో కుటుంబ బంధాలు బలోపేతమయ్యాయి. ఈ నేపథ్యంలో చాలామంది సొంత ఊళ్లో తల్లిదండ్రులు, బామ్మ, తాతయ్యలతో కలిసి జీవించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వాలు తీసుకున్న చర్యల ఫలితంగా రియల్ రంగంలో కొనుగోళ్ల ప్రక్రియ సులభతరం కావడం కూడా ఎన్నారైలకు ఉపకరిస్తోంది.
భారత్ లో అనేక రకాల ప్రాపర్టీలు అందుబాటులో ఉండటం.. ఎక్కడి నుంచైనా వర్చువల్ గా వాటిని చూసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటం కూడా రియల్ పెట్టుబడులు పెరగడానికి మరో కారణం. షేర్లు, బంగారం కంటే రియల్ రంగంలో పెట్టుబడులకే ఎక్కువ మంది ఎన్నారైలు మొగ్గు చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ సురక్షితపై పెట్టుబడి అని భావించడమే ఇందుకు కారణం.
అలాగే రెరా చట్టం రావడంతో ఈ రంగంలో పారదర్శకత పెరగడంతో ఎన్నారై కొనుగోలుదారులకు భారత రియల్ రంగంపై భరోసా పెరిగింది. పైగా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం.. చాలా దేశాలు మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నా.. భారతదేశం తగిన రక్షణాత్మక చర్యలు అవలంబించడంతో ఆ ముప్పు నుంచి దూరంగా ఉందంటున్న నిపుణుల ప్రకటనలు కూడా ఎన్నారైల రియల్ పెట్టుబడులకు కారణాలు.