* 102 ఎకరాలు సీలింగ్లో నమోదైన భూమి
* 1977 భూ సంస్కరణల ట్రిబ్యునల్ ఆర్డర్‌లో నమోదు
* కొంత భూమి భూదాన్‌లోకి ఎలా చేరింది?
* 2021లో ధరణిలోకి ఎలా ఎక్కింది?
* అప్పటి కలెక్టర్ పాత్ర గురించి మాట్లాడరా?
* ఎమ్మార్వోదే బాధ్యత అంటే ఎలా?
* అన్నీ తెలిసే స్థలం కొన్న ఈఐపీఎల్!
* ప్రభుత్వ భూములతో ఈఐపీఎల్ గేమ్స్?
* ఎకరానికి రూ. 4.5 కోట్ల చొప్పున ప్రీలాంచ్
* కేసు నమోదుతో సొమ్ము వెనక్కి ఇస్తారా?
* ఈఐపీఎల్ ప్రీలాంచ్ వ్యవహారం
* ఎమ్మార్వో, అప్పటి కలెక్టర్‌లపై
* సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు?
* ఈఐపీఎల్‌పై ఎలాంటి చర్యలు?
రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఫలితంగా స్థలాల ధరలూ పెరిగాయి. ఫ్లాట్ల రేట్లూ ఆకాశాన్నంటాయి. అలాంటి తరుణంలో కొందరు డెవలపర్లు కష్టపడి వృద్ధి చెందితే.. ఈఐపీఎల్ వంటి సంస్థలు మాత్రం వివాదాస్పద భూముల్ని కొనడం వాటిలో ప్రీలాంచులను ప్రకటించడం అలవర్చుకున్నాయి. కొనుగోలుదారుల్ని నమ్మించి ప్రీలాంచుల పేరిట ఈఐపీఎల్ సంస్థ కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. పంపకాల్లో తేడా రావడంతో సంస్థ డైరెక్టర్లే ఒకరి మీద మరొకరు కేసులు పెట్టుకునే దాకా వెళ్లారు. ఆ తర్వాత ఎవరి వ్యాపారం వారు పెట్టుకున్నారనుకోండి. అయితే, మహేశ్వరంలోని ఒక స్థలానికి సంబంధించిన కేసులో మాత్రం.. ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్స్ పార్ట్‌నర్ కొండపల్లి శ్రీధర్ రెడ్డితో పాటు మరికొందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు సూచించడంతో.. ఒక్కసారిగా ఈ కంపెనీ వార్తల్లోకెక్కింది. ఇంతకీ కేసు పూర్వాపరాలేమిటి? ప్రీలాంచులో ఈఐపీఎల్ పెట్టిన ఆఫరేంటీ?
ప్రీలాంచుల్లో ఫ్లాట్లు, విల్లాల్ని విక్రయించడం వల్ల అప్పన్నంగా కోట్ల రూపాయలొచ్చినట్లు ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెడితే ఎంతటి అక్రమం అయినా సక్రమం అవుతుందనే అపోహలో ఉంటూ.. సమాజంలో తామేం చేసినా చెల్లుతుందనే భ్రమించే వారిలో ఈఐపీఎల్ సంస్థ చేరిందేమోననే సందేహంగా ఉంది. ఎందుకంటే, ప్రభుత్వ భూమి అని తెలిసీ.. అందులో అనేక కోర్టు వివాదాలు ఉన్నాయని తెలిసీ.. అందులోకి దూరిపోయి.. స్థానిక ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్‌కు కోట్ల రూపాయల ముడుపుల్ని అందజేసి.. స్థలాన్ని అక్రమంగా కొనుగోలు చేసే ప్రయత్నం చేసి.. అడ్డంగా బుక్కయిందీ సంస్థ. ఈ 42 ఎకరాలే కాకుండా.. పక్కనుండే వందకు పైగా ఎకరాల్ని కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్ చేసింది. కాకపోతే.. ఢామిట్.. కథ అడ్డం తిరిగింది.
ప్రీలాంచ్ ఎక్కడ?
శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 15కు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో గల నాగారంలో 150 ఎకరాల్లో ప్రీమియం హై ఎండ్ విల్లాలను నిర్మించడానికి స్కెచ్ చేసింది. ఎవరైనా తొలుత ఎకరానికి రూ.4.5 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. 1200 గజాల స్థలంలో ఏడు వేల చదరపు అడుగుల్లో విల్లాను నిర్మించి ఇస్తామని ప్రీలాంచ్ స్కీముని ప్రకటించింది. అనుమతులు ఆరు నుంచి ఎనిమిది నెలల్లో వస్తాయని నమ్మబలికింది. ప్రాజెక్టును ప్రకటించే సమయానికి ధర రూ.9 కోట్లకు చేరుకుంటుందని ప్రచారం చేసింది. బుకింగ్ చేసుకున్న అరవై రోజుల్లోనే పూర్తి సొమ్మును చెల్లించాలని తెలియజేసింది. విల్లా సైజును బట్టి అదనపు ఛార్జీలుంటాయని చెప్పింది. అప్పటికే మోకిలా, మంచిరేవుల, గండిపేట్ వంటి ప్రాంతాల్లో నిర్మాణాల్ని అందజేసిన ఈ సంస్థను నమ్మిన కొందరు పెట్టుబడిదారులు.. రూ.4.5 కోట్లు చొప్పున విల్లాల్ని కొనుగోలు చేశారని సమాచారం. మరి, మ్యుటేషన్ చేసిన ఎమ్మార్వోతో పాటు ఈఐపీఎల్ శ్రీధర్ రెడ్డిలపై కేసు నమోదు కావడంతో ఈ ప్రాజెక్టుపై నిలినీడలు కమ్ముకున్నాయి. నిన్నటివరకూ ఎవరికీ తెలియని ఈ అక్రమ వ్యవహారం ఒక్కసారిగా బయటికి పొక్కడంతో ప్రతిఒక్కరికీ వివాదం గురించి అర్థమైంది.
* ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్నంగా గమనిస్తే.. ఈఐపీఎల్ సంస్థ 150 ఎకరాల్లో ప్రీమియం విల్లా కమ్యూనిటీ కడతామని ప్రకటించింది. వాస్తవానికీ స్థలం ఈఐపీఎల్ ది కాదని తెలిసినప్పటికీ, న్యాయపరమైన చిక్కులున్న స్థలాన్ని ఎలాగైనా క్లియర్ చేసుకుంటామనే ధీమాతో అడుగు ముందుకేసింది. ప్రజల నుంచి కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. ఇప్పుడేమో కోర్టు ఈఐపీఎల్ సంస్థ పార్ట్‌నర్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఆ స్థలాన్ని మ్యుటేషన్ చేసిన ఎమ్మార్వోలతో పాటు మరికొందరి మీద కేసును నమోదు చేయమని ఆదేశించింది. ఈ క్రమంలో ఇందులో విల్లాలు కొన్నవారి పరిస్థితి ఏమవుతుంది? కేసును క్షుణ్నంగా గమనిస్తేనేమో.. అంత సులువుగా పరిష్కారమయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే?
* హాజీ ఖాన్ అనే నవాబుకు మహేశ్వరంలోని సర్వే నెంబరు 181లో 92 ఎకరాలు, 182లో 10.20 ఎకరాలు ఉంది. 181 సర్వే నెంబరులోని 92 ఎకరాల్లో దాదాపు యాభై ఎకరాల స్థలం భూదాన్ భూములుగా రికార్డుల్లోకెక్కింది. మిగతా 42 ఎకరాల స్థలం అక్రమంగా ఈఐపీఎల్‌కు రిజిస్టర్ అయ్యింది. 2021లో ఈ స్థలం ఖాదరున్నీసా పేరిట ధరణిలో నమోదైంది. మరి, అప్పటి జిల్లా కలెక్టర్‌కు తెలియకుండానే ఇదంతా జరిగిందా? హాజీ ఖాన్‌కు తాను వారసురాలని.. సక్సెషన్ తన పేరిట చేయాలని ఆమె ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోగానే ఎమ్మార్వో, అప్పటి జిల్లా కలెక్టర్ అంగీకరించి. ధరణిలో ఎక్కించారు. పాస్ పుస్తకాల్ని ఇప్పించారు. ఈమె ఆయా భూమిని బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, సంతోష్ కుమార్ లకు విక్రయించగా.. వారి నుంచి ఈఐపీఎల్ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం.
అసలు కథ ఏమిటంటే..
వాస్తవానికి, హాజీ ఖాన్‌కు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు. అందులో ఒక కూతురే ఈ ఖాదరున్నీసా. ఈ మొత్తం భూమి మిగతా ఐదు మందికి వాటా వస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అయినా కూడా తానే ఈ మొత్తం భూమికి వారసురాలుగా ప్రకటించుకున్నారు. మరి, అది వాస్తవమో కాదో తెలుసుకోకుండా.. ఎమ్మార్వో మరియు కలెక్టర్ ఆమె పేరిట సక్సెషన్ చేశారు.
* నిజానికి, 1970లో 181 సర్వే నెంబరులోని 92 ఎకరాలు మరియు 182 సర్వే నెంబరులో గల 10.20 ఎకరాలను హాజీ నవాబ్ సీలింగ్‌లో ప్రకటించారు. తన ఇద్దరు కుమారులైన అక్బర్ అలీ ఖాన్ పేరిట 57 ఎకరాలు, చిన్న కుమారుడైన ఫారూఖ్ అలీ ఖాన్‌కు 46 ఎకరాలకు అందజేస్తున్నట్లు తెలిపారు. తర్వాత నోటిమాట ద్వారా తన ఇద్దరు కుమారులకు బహుమతిగా ఇస్తున్నానని చెప్పారు. ఇదే విషయం 1977 భూసంస్కరణల ట్రిబ్యునల్ ఆర్డర్‌లో నమోదు కావడం గమనార్హం. ఆ ఆర్డర్ కాపీని చూసి ఉంటే ఎమ్మార్వోకు వాస్తవం అర్థమయ్యేది.
* ఖాదరున్నీసా మాత్రం తన తండ్రి 52.20 ఎకరాల (181 సర్వే నెంబరులో 42 ఎకరాలు, 182 సర్వే నెంబరులో 10.20 ఎకరాలు) భూమిని 2005లో తనకు బహుమతి (హిబా)గా ఇచ్చారని తెలియజేసింది. అంతకు ముందే ఆమె 10.20 ఎకరాలను బొబ్బిలి దామోదర్ రెడ్డి తదితరులకు 2018లో విక్రయించారు. అప్పటి స్థానిక ఎమ్మార్వోను ఏదో రకంగా మేనేజ్ చేసి విక్రయించారు. అదే తరహాలో 2021లో 181 సర్వే నెంబరులోని 42 ఎకరాల్ని.. అప్పటి ఎమ్మార్వో మరియు కలెక్టర్ సహకారంతో తన పేరు మీద ధరణీలోకి ఎక్కించుకుని, ఆతర్వాత బొబ్బిలి విశ్వనాధ్‌రెడ్డి, సంతోష్ కుమార్‌ల ద్వారా ఈఐపీఎల్‌కు అమ్మేసింది. ఈ మొత్తం తతంగానికయ్యే ఖర్చు మొత్తం ఈఐపీఎల్ సంస్థ భరించినట్లు సమాచారం. మరి, ఈఐపీఎల్ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో విల్లాలు కొనుక్కున్నవారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.