-
నగర రియాల్టీలో సరికొత్త మోసం?
-
బయ్యర్లు తస్మాత్ జాగ్రత్త..
-
ఏజెంట్లకు అధిక కమిషన్లు..!
-
అందుకే వాటిలో కొనమంటారు..
-
రెరా అనుమతి ఉంటేనే కొనాలి
కమర్షియల్ స్పేస్ కొంటే అద్దె చెల్లిస్తామనే ప్రకటనలు చూశాం. కానీ, ప్లాటు కొంటే నెలకు 10 వేల నుంచి 25 వేల దాకా అద్దె చెల్లిస్తామనే కంపెనీలను ఎప్పుడైనా చూశామా? లేదు కదా.. పైగా ఆస్ట్రేలియా టేకు చెట్లను ఉచితంగా ఇస్తారట. భారతదేశం టేకు చెట్లు కనిపించట్లేదు. బర్మా టేకు చెట్లు కనుమరుగయ్యాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా టేకు చెట్లకు వచ్చింది. ప్చ్.. ఎంత దారుణం? నగర రియల్ రంగం వికృత పోకడలకు అడ్డాగా మారుతున్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి ప్లాట్లను కొనుగోలు చేయాలి.
రియాల్టీ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు పుట్టుకొస్తుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ పోకడల వల్ల కొనుగోలుదారులకు ఉపయోగం కలిగితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కరోనాకు అటుఇటుగా కొన్ని సంస్థలు.. ప్రీలాంచ్లో ప్లాట్లు, ఫ్లాట్లను ఇష్టం వచ్చినట్లు.. ఫ్యాన్సీ రేటుకు విక్రయించాయి. ఇక చదువుకున్న వారు, నిరక్షరాస్యులు, బడా ఉద్యోగులు, వృత్తి నిపుణులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ప్రవాసులు.. ఇలా ప్రతిఒక్కరూ ఏదో ఒక సందర్భంగా ప్రీలాంచ్లో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేశారు. వారిలో అధిక శాతం మంది చేతికి ఫ్లాటు రాక.. పెట్టిన సొమ్మూ చేతికి రాక.. నానా ఇబ్బందులు పడుతున్నారనుకోండి. అదీ వేరే విషయం.
ఆ తర్వాత కొంతమంది స్కామ్స్టర్లు.. మరో ట్రెండ్‌ను ఆరంభించారు. వాణిజ్య సముదాయాల్లో మదుపు చేస్తే నెలకు అద్దె ఇస్తామంటూ ఎంచక్కా కోట్ల రూపాయల్ని వసూలు చేసి.. నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రీలాంచ్‌లు, తక్కువ రేటు ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాల్నుంచి అద్దె.. ఇవన్నీ పాత చింతకాయ పచ్చడిగా మారాయి. రేటు తక్కువ.. ప్రీలాంచ్ అంటే బయ్యర్లు ముందుకు రావట్లేదని గుర్తించిన కొందరు రియల్ అక్రమార్కులు సరికొత్త ఎత్తుగడ వేశారు. బయ్యర్లను ఎలాగైనా బోల్తా కొట్టించాలనే ఉద్దేశ్యంతో సరికొత్త స్కామ్‌కు శ్రీకారం చుట్టారు. ఎంతో నమ్మకానికి కలిగించేలా మాయమాటలు చెబుతూ.. కొనుగోలుదారుల నుంచి సొమ్ము లాగేస్తున్నారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్, నారాయణఖేడ్, వికారాబాద్, జనగాం వంటి ప్రాంతాల్లో.. ప్లాట్లను కొంటే నెలకు అద్దె చెల్లిస్తామంటూ సరికొత్త మోసానికి తెరలేపారు. వీరి దృష్టి మొత్తం బయ్యర్ల నుంచి ఎలాగైనా సొమ్మును కొల్లగొట్టాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది.
జడ్చర్లలో సన్నిధి ఆగ్రో ఫామ్స్ డ్రీమ్ ఆర్చాడ్స్ అనే సరికొత్త ప్రీలాంచ్ వెంచర్‌ను ఏప్రిల్ 2న ఆరంభం కానున్నది. ఇందులో 242 గజాల ప్లాటు (గుంటలు) ను రూ. 10 లక్షలకు అందజేస్తామని కొనుగోలుదారులను ఊరిస్తున్నది. ఆ కంపెనీ పేరు కూడా ఎక్కడా ప్రచురించకుండానే ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇందులో ప్లాటు కొనేవారు లక్ష కడితే ఒక గ్రాము బంగారం ఇస్తారట, అదే రోజు రూ.2 లక్షలు కడితే 2 గ్రాములు ఇస్తారట. పైగా ప్లాటు తీసుకున్నవారికి నెలకు పది వేలు చొప్పున 100 నెలల పాటు అద్దె చెల్లిస్తారట. 605 గజాల స్థలం కొంటే.. 30 ఆస్ట్రేలియా టేకు చెట్లను అందజేస్తారట. సుమారు రూ.25 లక్షలు పెట్టి స్థలం కొంటే.. నెలకు రూ.25 వేలు చొప్పున దాదాపు వంద నెలల పాటు అద్దె కూడా చెల్లిస్తారట.
మరి, నెలకు పది వేలు అద్దె ఎలా ఇస్తారు? ఎంతకాలం ఇస్తారు? రెండు, మూడు నెలలు అద్దె ఇచ్చినట్లే ఇచ్చి తర్వాత చేతులెత్తేస్తే మీ పరిస్థితి ఏమిటి? ప్లాట్లు అమ్మేసిన తర్వాత మీకు ప్లాట్లను అంటగట్టిన ఏజెంట్లు కనిపించరు. వెంచర్లో పిచ్చొమొక్కలు తప్ప ఏమీ కనిపించవు. ఇక మీరు మీ సొమ్ము కోసం సంస్థ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరగక తప్పదు. కాబట్టి, మీ కష్టార్జితాన్ని బూడిదలో పోసీన పన్నీరు కావొద్దంటే.. వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేయండి.
నెలకు రూ.10,000 చొప్పున అద్దె ఎలా ఇస్తారు? ఏయే ప్రాతిపదికన ఇస్తారు? కొంతకాలం ఇచ్చి వదిలేస్తే ఎలా? మీ పేరిట స్థలం రిజిస్టర్ చేస్తామని చెబుతారు. భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారం చెందని ప్రాంతంలో ప్లాటు ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి. మహేశ్వరంలో 2007లో ఉన్న ప్లాటు రేటు.. పెరగడానికి దాదాపు పదేళ్లు పట్టించదనే విషయాన్ని మర్చిపోవద్దు. పైగా, ప్రభుత్వం పలు సంస్థల్ని ఆరంభించాకే ఆమాత్రం పెరుగుదల అయినా వచ్చింది. కాబట్టి, ప్లాటు కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాక.. నలుగురి అభిప్రాయం తెలుసుకున్నాకే తుది నిర్ణయానికి రండి.