నగరంలో ఎక్కడైనా ప్లాటు దొరుకుతుందంటే చాలు.. కొనుగోలు చేయడానికి చాలామంది ముందుకొస్తారు. ఎందుకంటే, సిటీలో సొంతంగా ఇల్లు కట్టుకుని ఉండటానికి ఎవరికైనా ఇష్టమే కదా!పైగా, ఎల్‌బీనగర్ కి చేరువలో ప్లాట్లంటే ఎవరూ వెనకడుగు వేయరు. ఫలానా చోట ప్లాట్లు దొరుకుతున్నాయని తెలిస్తే ఎవరైనా ముందుగానే వెళ్లి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కాకపోతే, హైదరాబాద్‌లో ఇందుకు భిన్నంగా జరుగుతోంది ఎందుకు? ఒక ప్లాటు కొంటే యాభై గ్రాముల బంగారం ఉచితం అని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? భాగ్యనగరంలో రియల్ గిరాకీ తగ్గుముఖం పట్టిందా? లేక ఆ వెంచర్‌లో కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపించట్లేదా?
ఎల్ బీ నగర్ నుంచి కేవలం ఐదు నిమిషాల్లో చేరుకునే బీఎన్ రెడ్డి నగర్‌లో జీ స్క్వేర్ అనే సంస్థ ఈడెన్ గార్డెన్ తపోవన్ అనే 484 ప్రీమియం ప్లాట్ల వెంచర్‌ను 65 ఎకరాల్లో ఆరంభించింది. రెరా ఆమోదం పొందిన ఈ వెంచర్‌లో సుమారు వెయ్యికి పైగా ప్రపంచ స్థాయి సౌకర్యాల్ని అందజేస్తున్నారు. నలభైకి పైగా క్రీడా వసతులున్నాయి.. క్లబ్ హౌజ్‌ను నలభై వేల చదరపు అడుగుల్లో కడుతున్నారు. మరి, ఇన్నిన్ని ప్రత్యేకతలు గల ఈ వెంచర్లో ప్లాటు కొంటే యాభై గ్రాముల బంగారం ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? అంటే, హైదరాబాద్ రియల్ మార్కెట్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయా? లేక ఈ వెంచర్‌లో ప్లాట్లు అమ్ముడు కావడం లేదా? కొన్ని నెలల క్రితం ఈ వెంచర్‌ను అట్టహాసంగా ఆరంభించిన జీ స్క్వేర్ సంస్థ.. భారీ ప్రచారంతో నగరవాసులను ఇట్టే ఆకట్టుకుంది. కాకపోతే, ఆ వెంచర్‌లో పలు అక్రమాలకు పాల్పడిందని పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. అందుకే, అందులో ప్లాట్లు కొనడానికి కొందరు కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇదే సంస్థ చౌటుప్పల్‌లో ఎపిటోమ్ అనే వెంచర్‌ను డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే. పలు వివాదాలకు నిలయమైన ఈ వెంచర్లో ప్లాటు కొంటే 25 గ్రాముల బంగారం నాణెం ఉచితమని సంస్థ ప్రచారం ఊదరగొడుతుంది. 1242 ఎకరాల్లో ఈ వెంచర్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. కాకపోతే, ఇప్పటికే ఈ 1242 ఎకరాల్లో స్థలం కొనుగోలు చేయడానికి కొందరు రియల్టర్లు సంస్థకు కోట్ల రూపాయల అడ్వాన్సులు చెల్లించారని సమాచారం. అడ్వాన్సు చెల్లించిన రియల్టర్లకు భూమి ఇవ్వకుండా.. జీ స్క్వేర్ సంస్థకు ఎలా భూమిని కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరి, దీనిపై ఈ 1200 ఎకరాల స్థల యజమాని జవాబు చెప్పాలి.