ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల ప్రత్యేకత ఏమిటంటే.. ఎలాంటి ఎమిషన్స్ లేకుండా.. నాలుగు లక్షల కుటుంబాలకు మంచినీరును అందిస్తున్నాయి. ఈ రిజర్వాయర్లు జీరో ఎమిషన్ క్లైమెట్ ఫ్రెండ్లీ అర్బన్ వాటర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. కేవలం ఐదు పైసలకే మంచినీటిని సరఫరా చేస్తున్న జలాశయాలు ప్రపంచంలో ఎక్కడా లేనే లేవు. మరి, హైదరాబాద్కి షాన్ అయిన గండిపేట్ నీళ్లు నిజంగానే మనకు అక్కర్లేదా? రియల్ ఎస్టేట్ వర్గాల కోసమే ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తున్నారా? ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత ప్రకటన వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి వాటిల్లే నష్టమేంటి?
హైదరాబాద్ రియల్ రంగంలో ఏడాదికి సుమారు 25 వేల ఫ్లాట్లు అమ్ముడవుతాయని నిపుణుల అంచనా. ఒక్కో ఫ్లాట్ సుమారు 1500 చదరపు అడుగులు ఉంటుందని అనుకుందాం. కొందరు బిల్డర్లు ఎకరానికి ఎంతలేదన్నా 2 లక్ష చదరపు అడుగులు కడతారని అనుకుంటే.. ఏడాదికి కనీసం 750 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఇందులో పశ్చిమ హైదరాబాద్ వాటా ఎక్కువ అని, ఎంతలేదన్నా 500 ఎకరాల దాకా ఉంటుందని నిపుణుల అంచనా. ఏడాదికి పది మిలియన్ చదరపు అడుగుల ఐటీ స్థలాన్ని పలువురు బిల్డర్లు నిర్మిస్తారు. వీటిని కట్టేందుకు కనీసం 75 ఎకరాలు ప్రతిఏటా కావాలి. ఇతరత్రా వాణిజ్య సముదాయాలు, షాపింగ్ మాళ్లు కట్టేందుకు ఎంతలేదన్నా 25 ఎకరాలు ఏటా అవసరం అని చెప్పొచ్చు. మొత్తానికి, హైదరాబాద్ రియల్ రంగంలో అపార్టుమెంట్లు, ఐటీ సముదాయాల్ని కట్టేందుకు ప్రతిఏటా ఎంతలేదన్నా 800 ఎకరాలు అవసరం అవుతాయి. దీనికి 200 ఎకరాలను అదనంగా జోడిస్తే మొత్తం 1000 ఎకరాలు కావాలని అనుకుందాం. ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశాక.. అందులో 65 వేల ఎకరాలే అందుబాటులోకి వస్తాయని అనుకుందాం. అంటే, వచ్చే అరవై ఐదేళ్లకు సరిపడా భూములు లభిస్తాయని చెప్పొచ్చు.
ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తే.. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతాయి. కాకపోతే, పశ్చిమ హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల్లో భూముల రేట్లు తగ్గే అవకాశం లేకపోలేదు. ఫలితంగా, అక్కడ కడుతున్న అపార్టుమెంట్ల రేట్లు తగ్గే ప్రమాదముంది. ఇప్పటివరకూ యూడీఎస్, ప్రీలాంచుల్లో బహుళ అంతస్తులు, ఆకాశహర్య్మాలు కట్టే ప్రాజెక్టులు ఆగిపోతాయి.