ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేయడానికి రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడంతో రియల్ రంగం ఒక్కసారిగా అయోమయంలో పడిపోయింది. నిన్నటివరకూ కోకాపేట్‌లో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటల్లో.. ఎకరానికి రూ.40 నుంచి 60 కోట్లు పెట్టిన భూములు కొన్నవారిలో కొంతమంది ఆందోళన చెందుతున్నారు. జీవో నెం. 50 ద్వారా ఆకాశహర్మ్యాల్ని విశేషంగా ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నదేమిటని డెవలపర్లు విస్తుపోతున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పొప్పాల్‌గూడ, నార్సింగి, కోకాపేట్, ఉస్మాన్ నగర్, కొల్లూరు, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ఆకాశహర్మ్యాల్ని ఆరంభించిన పలువురు డెవలపర్లు తలపట్టుకున్నారు.
2018 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ.. పశ్చిమ హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా జీవో నెం. 50ని తీసుకొచ్చారు. రాయదుర్గం, ఖానామెట్, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో వేలం పాటల్ని నిర్వహించింది. ఎకరం సుమారు రూ.30 నుంచి రూ.60 కోట్లకు విక్రయించింది. దీంతో, అందులో అనేక మంది డెవలపర్లు బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల్ని పోటీపడి ఆరంభించారు. వీటిలో కొన్ని ఆరంభ స్టేజీలో ఉండగా మరికొన్ని మధ్యస్థ స్థాయిలో ఉన్నాయి. మరికొన్నేమో చివరి దశలో ఉన్నాయి. ఈ క్రమంలో హఠాత్తుగా ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వీరి మీద పిడుగు పడినట్లయ్యింది. దీంతో ఏం చేయాలో కొందరు డెవలపర్లు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ ఎటువైపు పయనిస్తుందో తెలియక తికమక పడుతున్నారు.