హైదరాబాద్ రియల్ భూమ్ బాగానే సాగుతున్నట్టుగా పలు సర్వేలు చెబుతున్నప్పటికీ, గత ఏడాది కాలంలో రిజిస్ట్రేషన్లలో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. భూముల ధరలు విపరీతంగా పెరగడం, ప్రాపర్టీల ధరలు ఆకాశాన్నంటడం, అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటమే ఇందుకు కారణమని ఈ రంగానికి సంబంధించిన అధికారులు, వ్యక్తులు చెబుతున్నారు. అయితే, రిజిస్ట్రేషన్ల లావాదేవీల సంఖ్య తగ్గినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది కంటే ఎక్కువ ఆదాయమే సమకూరింది. భూముల మార్కెట్ విలువలు పెరగడంతోనే ఆదాయం కూడా పెరిగిందని ఓ అధికారి వెల్లడించారు. అయితే, అదే సమయంలో ఈ ఏడాది జనవరి నుంచి ఆదాయం తగ్గుతోందన్నారు.
రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. 2022-23లో ఆస్తి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.14,291 కోట్లు ఆదాయం వచ్చింది. ఇది 2021-22 కంటే దాదాపు రూ.2వేల కోట్లు ఎక్కువ. 2021-22లో 19.72 లక్షల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. 2022-23లో అవి 19.44 లక్షలకు తగ్గాయి. అంటే దీనర్థం ఆస్తులు తీసుకునేవారు లేకపోవడం వల్లే రిజిస్ట్రేషన్లలో క్షీణత ఉందని కాదని ఓ అధికారి పేర్కొన్నారు. 2022 నవంబర్ మినహా మిగిలిన నెలల్లో లావాదేవీలు తగ్గాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గత మూడు నెలల్లో నెలవారీ ఆదాయం గతేడాది అదే కాలంతో పోలిస్తే మరింత తగ్గిందని వెల్లడించాయి. 2022 జనవరిలో 2.08 లక్షల ఆస్తి రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఈ ఏడాది జనవరిలో 1.60 లక్షల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. ఫిబ్రవరిలో 1.70 లక్షలు, మార్చిలో 1.50 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య ఆదాయంలో దాదాపు రూ.వెయ్యి కోట్ల లోటు ఉందని అధికారులు వెల్లడించారు.
సాధారణంగా ఎన్నికలకు ఏడాది ముందు రియల్టర్లు, పెట్టుబడి ప్రయోజనాల కోసం ప్రాపర్టీ కొనుగోలు చేసేవారు ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు వేచి చూస్తారని పలువురు చెబుతున్నారు. అలాగే నగరంలో.. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్ లో భూముల ధరలు అసాధారణంగా పెరగడం, మౌలిక వసతుల కంపెనీలు ఫ్లాట్ల ధరలు పెంచడం, కరోనా తర్వాత ఉక్కు, నిర్మాణ సామగ్రి ఖర్చులు పెరగడం కూడా ఇందుకు కారణమని పేర్కొంటున్నారు.