- బ్రాండెడ్ డెవలపర్ల ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్
- అనరాక్ తాజా నివేదికలో వెల్లడి
దేశవ్యాప్తంగా కొత్త ఇళ్ల కొనుగోలులో హైదరాబాద్ టాప్ లో నిలిచింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2023 తొలి త్రైమాసికంలో 14,280 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 క్యూ1లో 5,400 యూనిట్లు మాత్రమే అమ్ముడు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య మరింతగా పెరగడం విశేషం. రెడీ టూ మావ్ ఇళ్లకే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, అవి కొత్తగా ప్రారంభించిన ఇళ్ల కోసం ఎక్కువ మంది చూస్తున్నారని అనరాక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. కొనుగోలుదారుల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రకాల ఫీచర్లు కలిగి ఉన్న ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగినట్టు తేలింది.
2023 క్యూ1లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడైన 1.14 లక్షల యూనిట్లలో 41 శాతానికి పైగా యూనిట్లు కొత్తగా ప్రారంభమైన వాటిలో ఉన్నాయి. 2019లో ఇది చాలా తక్కువగా ఉంది. ఆ సమయంలో అమ్ముడైన 78,520 యూనిట్లలో కొత్తగా ప్రారంభమై ఇళ్ల వాటా 26 శాతం మాత్రమే ఉంది. 2022 క్యూ1లో అమ్ముడైన 99,550 యూనిట్లలో కొత్తగా ప్రారంభమైన ఇళ్లు 36 శాతంగా ఉన్నాయి. కాగా, మొత్తం అమ్ముడైన యూనిట్లలో కొత్తగా లాంచ్ అయిన యూనిట్ల వాటా హైదరాబాద్ లోనే ఎక్కువగా నమోదైంది. ఇక్కడ 2023లో క్యూ1లో 14,280 యూనిట్లు అమ్ముడుకాగా, కొత్తగా ప్రారంభమైన ఇళ్ల వాటా 46 శాతంగా ఉంది. ఇదే 2019 క్యూ1లో 28 శాతంగా రికార్డయింది. పుణెలో 19,920 యూనిట్ల విక్రయం జరగ్గా.. కొత్తగా ప్రారంభమైన ఇళ్ల వాటా 45 శాతంగా ఉంది. క్యూ1లో ఇది 35 శాతం కావడం గమనార్హం. బెంగళూరులో 15,660 యూనిట్లు అమ్ముడుకాగా, కొత్తగా ప్రారంభమైన ఇళ్ల వాటా 43 శాతంగా నమోదైంది. 2019 క్యూ1లో ఇది 28 శాతంగా నమోదైంది. చెన్నైలో అమ్ముడైన 5,880 యూనిట్లలో కొత్తగా ప్రారంభించిన ఇళ్ల వాటా 41 శాతంగా ఉంది. ఇది 2019లో 29 శాతంగా నమోదైంది.