- వినియోగదారులు కూడా పెరుగుతున్నారు
కరోనా నేపథ్యంలో కకావికలైన మాల్స్ కుదుటపడుతున్నాయి. రిటైల్ మాల్స్ అద్దె ఆదాయంలో వృద్ధి నమోదైందని.. మాల్స్ కి వచ్చే వినియోగదారులు కూడా పెరుగుతున్నారని తాజా నివేదికలో వెల్లడైంది. కరోనాకు ముందుతో పోలిస్తే.. గత ఆర్థిక సంవత్సరంలో మాల్స్ అద్దె ఆదాయం 27 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. అది ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 10 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కస్టమర్ల రాక, విక్రయాల్లో మెరుగైన వృద్ధి ఉండటంతో నికర నిర్వహణ ఆదాయం పెరుగుతున్నట్టు వెల్లడైంది.
మాల్స్ కు వచ్చే కస్టమర్ల సంఖ్య భారీగా పెరగడంతో ట్రేడింగ్ విలువ 125 శాతానికి పెరిగింది. కొనుగోలుదారుల ఆదాయం పెరగడం, ప్రీమియం ఉత్పత్తుల వైపు వారు మొగ్గు చూపించడంతోనే ట్రేడింగ్ విలువ పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగుతుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మాల్స్ ఆపరేటర్లకు మంచి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్స్ అద్దె పెంపు 3 నుంచి 4 శాతం వరకు ఉండొచ్చని ఇక్రా నివేదిక తెలిపింది. జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, ఆహారం, పానీయాలు, వినోదం కోసం కస్టమర్లు ఖర్చు చేసే ధోరణి పెరుగుతుందని.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యం 4-5 శాతం అధికంగా నమోదు కావచ్చని వివరించింది. దీంతో మాల్స్ ఆపరేటర్లకు 8-10 శాతం మేర అధికంగా అద్దెల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది.