తెలంగాణలో అగ్రశేణి నిర్మాణ సంస్థ అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ తమ 56వ ప్రాజెక్టును ప్రకటించింది. కేవలం కొంపల్లిలోనే ఐదో ప్రాజెక్టుగా అపర్ణా కనోపి ఎల్లో బెల్స్ ను ఆరంభించింది. ఈ ఏడాదిలో ఆరంభమైన రెండో ప్రాజెక్టు ఇది. మూడు నెలల క్రితం నలగండ్లలో అపర్ణా సంస్థ అపర్ణా జైకాన్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే సంవత్సరంలో హైదరాబాద్, బెంగళూరులో కలిసి అపర్ణా సంస్థ మరో ఆరు ప్రాజెక్టుల్ని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. బహుళ అంతస్తుల భవనాలతో పాటు రెండు ప్లాటింగ్ లేఅవుట్లు, మూడు వాణిజ్య సముదాయాలూ ఉంటాయని సంస్థ చెబుతోంది.
* అపర్ణా కెనోపి ఎల్లో బెల్స్ ప్రాజెక్టును 10.5 ఎకరాల్లో నిర్మించడానికి సంస్థ ప్రణాళికల్ని రచించింది. ఇందులో పదిహేను అంతస్తుల ఎత్తు గల టవర్లు పది వస్తాయి. అన్నీ వాస్తుకు అనుగుణంగా నిర్మిస్తారు. ఇందులో వచ్చే ఫ్లాట్ల విస్తీర్ణం.. 1294 నుంచి 1911 చదరపు అడుగుల్లో ఉంటాయి. ఆధునిక సదుపాయాల నిమిత్తం సుమారు 44,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక క్లబ్ హౌజ్ ను నిర్మిస్తారు. ఎల్లో బెల్స్ 2025 మార్చి లోపు పూర్తి చేస్తారు.
సిల్వర్ జూబ్లీ సంవత్సరం..
సంస్థకు సంబంధించిన విస్తరణ ప్రణాళికల గురించి డైరెక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. 2021 సంవత్సరం తమకు అత్యంత కీలకమైనదని.. సానుకూలమైనదిగా అభివర్ణించారు. సంస్థను ఆరంభించి 25 ఏళ్లు అవుతోందని వెల్లడించారు. అందుకే వచ్చే ఐదేళ్లలో సుమారు ఆరు కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు ప్రాజెక్టుల్ని నిర్మించడానికి ప్రణాళికల్ని రచించామని వెల్లడించారు. రానున్న రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాల్లో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.