దాదాపు ఏడేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల్ని సవరిస్తుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే, మంగళవారం క్యాబినెట్ సబ్ కమిటీ.. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువల్ని సవరించాల్సిందేనని సూచించింది. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్‌లో గత ఎనిమిదేళ్లలో రిజిస్ట్రేషన్ విలువలు ఏడు సార్లు పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 11 శాతం, తమిళనాడులో ఏడున్నర శాతం, మహారాష్ట్రలో ఏడు శాతంగా రిజిస్ట్రేషన్ విలువలున్నాయి. కాకపోతే, మన వద్ద ప్రభుత్వం విలువల కన్నా ఎక్కువ మొత్తానికే లక్షలాది రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక్క హెచ్ఎండీఏ పరిధిలోనే ప్రభుత్వ భూముల విలువ కన్నా అధిక విలువకు 51 శాతం రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
అసలు సమస్య ఇదే..
ప్రభుత్వం నిర్దారించిన మార్కెట్ విలువ కన్నా రిజిస్ట్రేషన్ విలువ తక్కువగా ఉండటం వల్ల బ్యాంకు రుణాలు పొందడంలో గృహయజమానులకు ఇబ్బంది అవుతోంది. బిల్డర్లు అమ్మే రేట్లు ఆకాశానికి ఉంటే, ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ విలువ తక్కువగా ఉంది. దీంతో, వీలైనంత ఎక్కువ రుణం దొరకని పరిస్థితి నెలకొంది. పైగా, ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు భారీగా విలువ పెరిగింది. పైగా, రాష్ట్రానికి విచ్చేస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, హైదరాబాద్ చుట్టుపక్కల భూముల విలువలు అధికమయ్యాయి. మొత్తానికి, పెరిగిన విలువలకు తగ్గట్టుగా భూముల విలువల్ని సవరించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ సబ్ కమిటీ భావించింది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కి త్వరలోనే అందించాలని నిర్ణయం తీసుకుంది.
* మరి, సీఎం కేసీఆర్ ప్రభుత్వ భూముల మార్కెట్ విలువను సవరించాలని నిర్ణయం తీసుకుంటే, రాష్ట్రమంతటా స్థలాల ధరలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఫలితంగా, నగరాల్లో సామాన్యుల సొంతింటి కల మరింత భారమయ్యే అవకాశముంది. ప్లాట్ల ధరలకూ రెక్కలొచ్చే ఆస్కారం ఉంటుంది.