- పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సుమారు 95 నుంచి 100 సీట్లలో కచ్చితంగా గెలుస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని క్రెడాయ్ తెలంగాణ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి స్థిరమైన నాయకత్వం, సుస్థిరమైన ప్రభుత్వం కారణంగా తెలంగాణ దేశానికి మార్గదర్శిగా నిలిచామన్నారు.
అతిపిన్న రాష్ట్రమైన తెలంగాణ ఆరంభించే పథకాలు కేంద్రం కాపీ కొట్టి పేరు మార్చి ప్రవేశపెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. అయినా, బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రమంటే వ్యతిరేకత అని.. తమకు ఎలాంటి సహాయం అందించట్లేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడే ఆరంభమైందని.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని పూర్తి సినిమా త్వరలో చూపిస్తామన్నారు. నిర్మాణ రంగం బాగుపడాలన్నా.. తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా.. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తే దేశం అనుసరిస్తోందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మెట్రో రైలును సుమారు 250 కిలోమీటర్లకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈసీఐఎల్ నుంచి నగరం నలుమూలలా డెవలప్ చేస్తామన్నారు. ఎయిర్‌పోర్ట్ దాకా వేసే మెట్రో రైల్వే పనులకు రాజేంద్రనగర్‌లో ఫౌండేషన్ పనుల్ని ఆరంభిస్తామని తెలిపారు. సౌత్ వెస్ట్ కారిడార్‌లో వేసే ఈ మెట్రో వల్ల శంషాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు మాదాపూర్, గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలకు రాకపోకలు సులువు అవుతాయన్నారు. ఈ కారిడార్‌లో మరిన్ని పరిశ్రమలు వస్తాయన్నారు. ఫార్మా సిటీకి సంబంధించి కొన్ని కోర్టు కేసులున్నాయని తెలిపారు. సౌత్ ఈస్ట్‌తో పాటు నార్త్ ఈస్ట్ గణనీయంగా వృద్ధి చెందుతుందన్నారు.
నార్త్ ఈస్ట్ హైదరాబాద్‌లో మెడికల్ డివైజెస్ పార్కు, జినోమ్ వ్యాలీ వంటి వాటిని ఏర్పాటు చేశామన్నారు. జినోమ్ వ్యాలీ, ఎడ్యుకేషన్ సిటీ, ఫిలిం సిటీ వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నామని తెలిపారు. అంతకంటే ముందు క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి, ఛైర్మన్ చెరుకు రామచంద్రారెడ్డి, క్రెడాయ్ తెలంగాణ నేషనల్ సెక్రటరీ గుమ్మి రాంరెడ్డి, సీఐఐ తెలంగాణ ఛైర్మన్ సి.శేఖర్‌రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి తదిరులు ప్రసంగించారు.
మొత్తానికి, రాష్ట్రంలోని పదిహేను ఛాప్టర్ల నుంచి విచ్చేసిన క్రెడాయ్ సంఘ సభ్యులతో సభ మొత్తం కోలాహలంగా మారింది. మంత్రి కేటీఆర్ ప్రసంగాన్ని వీరంతా ఆస్వాదించారు. ఎంతో ఓపికగా ఆయన చెప్పే ప్రతి మాటల్ని విన్నారు. ఆయన కొన్ని విషయాలు చెబుతుంటే సభ మొత్తం చప్పట్లతో నిండిపోయింది. కార్యక్రమంలో నరెడ్కో అధ్యక్ష కార్యదర్శులు సునీల్ చంద్రారెడ్డి, మేకా విజయ్‌సాయి, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు, టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ టి.నర్సింహారావు, క్రెడాయ్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు ఎస్ రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ ట్రెజరర్ ప్రశాంత్ రావు, జనరల్ సెక్రటరీ ఇంద్రసేనారెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణారావు, వి.రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.