- ఏడు నగరాల్లో 6 శాతం తగ్గుదల
- వెస్టియన్ నివేదికలో వెల్లడి
దేశంలో రిటైల్ లీజింగ్ అద్భుత పురోగతి కనబర్చగా ఆఫీస్ లీజింగ్ స్తబ్దుగా మారింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బలహీన పనితీరు చూపించింది. ఈ కాలంలో మొత్తం ఆఫీసు లీజు విస్తీర్ణం 13.9 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన 14.8 మిలియన్ చదరపు అడుగులతో పోలిస్తే ఇది 6 శాతం తక్కువ. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కలిసి 8.2 మిలియన్ చదరపు అడుగులతో 59 శాతం కలిగి ఉన్నట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ ‘వెస్టియన్’ తన నివేదికలో పేర్కొంది.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా దేశీయంగా పెద్ద సంస్థలు, ఎంఎన్‌సీలు నిర్ణయాలు తీసుకోవడంలో నెలకొన్న జాప్యమే ఈ పరిస్థితికి కారణమని వివరించింది. నిజానికి ఈ త్రైమాసికంలో ఏడు నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్ 17 శాతం పెరిగినా.. లీజింగ్ కార్యకలాపాలు మాత్రం తగ్గడం గమనార్హం. ఆఫీస్ స్పేస్ లీజులో టెక్నాలజీ రంగం ముందున్నట్టు వెస్టియన్ తెలిపింది. ఆ తర్వాత ఇంజనీరింగ్, తయారీ రంగం నుంచి డిమాండ్ ఉందని.. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లోనూ కాస్త పురోగతి కనిపించినట్టు తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లు స్థిరపడితే ద్వితీయ ఆరు నెలల కాలంలో భారత్‌లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మెరుగుపడతాయని అంచనా వేసింది.
నగరాల వారీగా చూస్తే.. హైదరాబాద్ ఆఫీస్ లీజు మార్కెట్‌లో 4 శాతం తగ్గి.. 2.3 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 2.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. చెన్నై 83 శాతం వృద్ధితో 1.2 నుంచి 2.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. బెంగళూరులో 12 శాతం తగ్గుదల కనిపించి 3.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ముంబైలో 25 శాతం క్షీణించి 1.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
పుణెలో 6 శాతం పెరిగి 1.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ఢిల్లీలో 5శాతం తక్కువగా 2 మిలియన్ చదరపు అడుగులకు ఆఫీస్ లీజు పరిమితమైంది. కోల్‌కతాలో 88 శాతం తగ్గి, 0.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కాగా, జూన్ త్రైమాసికంలో ఆఫీస్ లీజులో టెక్నాలజీ రంగం 26 శాతం వాటా కలిగి ఉండటం గమనార్హం. ఇంజనీరింగ్, తయారీ రంగం వాటా 19 శాతంగా ఉండగా.. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వాటా 18 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరి-జూన్ కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 25.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటే.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పట్టణాల వాటాయే 14.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉండటం విశేషం.