-
ప్లాటు కొనేందుకు పలు
బ్యాంకులు రుణం మంజూరు!
-
కొందరి ఆసక్తికి కారణమిదే
-
ఇతర ప్రాంతాల్లోనూ ధరలకు రెక్కలు?
-
ల్యాండ్‌లార్డ్స్ ను పట్టుకోవడం కష్టమే!
-
వేలంపై డెవలపర్లలో భిన్నాభిప్రాయాలు
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటలపై టీఆర్ఎస్ పార్టీ కన్నెర్ర చేసింది. మంత్రి కేటీఆర్‌తో సహా పలువురు నేతలు అప్పటి వేలాల్ని బహిరంగంగా వ్యతిరేకించారు. బీఆర్ఎస్ కొత్త ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 2012 జూన్‌లో మీడియాతో వేలం పాటల గురించి మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరించకూడదని సూచించారు. ఒక సందర్భంలో అప్పటి టీఆర్ఎస్ నేత కేసీఆర్ ఒక టీవీ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో బంజారాహిల్స్‌లో గజం ధర లక్ష రూపాయలేమిటంటూ మండిపడ్డారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత.. కోకాపేట్ వేలంలో ఎకరం రూ.100 కోట్లు పలకగానే.. తెలంగాణ పరపతికి దర్పణమంటూ ఆయన కితాబునివ్వడం గమనార్హం. ఏదీఏమైనా, కోకాపేట్లో జరిగిన తాజా వేలం పాటలు.. హైదరాబాద్ రియల్ రంగం భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తుందా? అగాధంలోకి పడేస్తుందా? లేక మరింత అభివృద్ధి దిశగా తీసుకెళుతుందా? అనే అంశంపై మార్కెట్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశామని ప్రకటించింది. అయినా, దీనిపై పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. ఎందుకంటే, ఈ అంశానికి సంబంధించిన జీవో కూడా విడుదల కాలేదు. ఆయా ప్రాంతాల్ని గ్రీన్ జోన్‌గా డెవలప్ చేస్తామని ప్రకటించిన సగర్వంగా ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదు. ఈ క్రమంలో కోకాపేట్లో హెచ్ఎండీఏ తలపెట్టిన వేలం పాట ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. ట్రిపుల్ వన్ జీవో ప్రభావం ఈ వేలంపై పడుతుందా? ఎవరైనా అక్కడికొచ్చి అధిక ధరను వెచ్చించి కొంటారా? ఒకవేళ బిల్డర్లు రేటెక్కువ పెట్టి స్థలాన్ని కొన్నా.. అధిక రేటుకు ఫ్లాట్లను అమ్మవచ్చా? ఇలాంటి అనేక సందేహాల నేపథ్యంలో కోకాపేట్ వేలం జరిగింది. కొందరు ముందే ఊహించినట్లుగానే అధిక రేటుకే హెచ్ఎండీఏ ప్లాట్లను విక్రయించింది. నగరానికి చెందిన హ్యాపీ మొబైల్స్ అనే సంస్థ సుమారు రూ.100 కోట్లను వెచ్చించి దాదాపు మూడు ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకుంది. మరి, దీన్ని ప్రభావం రియల్ రంగంపై ఎలా పడుతుంది?
ధరలెక్కడ పెరుగుతాయ్?
కోకాపేట్లో జరిగిన మొదటి విడత వేలంలో ఎకరానికి రూ.40 కోట్లకు పైగా వెచ్చించి పలు సంస్థలు స్థలాన్ని కొనుక్కున్నాయి. దీంతో, చుట్టుపక్కల ప్రాంతాలైన నార్సింగి, కొల్లూరు, తెల్లాపూర్, వెలిమల, పాటి ఘనపూర్, మోకిల, శంకర్పల్లి, కిస్మత్పూర్, వంటి ప్రాంతాల్లోనూ భూముల ధరలకు క్రమక్రమంగా రెక్కలొచ్చేశాయి. ఫలితంగా.. స్థలాలున్నవారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. వారి గొంతెమ్మ కోరికలకు తలొగ్గిన కొందరు కొత్త బిల్డర్లు వెనకా ముందు చూడకుంగా.. రెండు కార్లు దూరడానికి సందు కూడా లేని చిన్న గల్లీల్లో ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఎకరానికి రూ.100 కోట్లు పలకడంతో.. ల్యాండ్ లార్డ్స్ ఆశలకు పట్టాపగ్గాలు ఉండనే ఉండవిక! ఇంతింటి భూమి రేట్లు ఉంటే.. ఆకాశహర్మ్యాల్ని కట్టలేమని కొందరు బిల్డర్లు ఇప్పటికే వాపోతున్నారు. మరికొందరేమో కోకాపేట్ ను వదిలేసి ఇతర ప్రాంతాల్లో ఫ్లాట్లను నిర్మించాలని నిర్ణయం తీసుకుంటున్నారు.
ఇలాగైతే సామాన్య మానవులు ఎలా బ్రతకాలి?
నియోపోలిస్‌లో ఎకరం రూ.100 కోట్ల గురించి యావత్ భారతదేశంలో చర్చ జరుగుతోంది. అన్ని మెట్రో నగరాల్ని అధిగమించిన ఎకరం విలువ రూ.100 కోట్లు దాటేసింది. దీంతో, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎక్కడికో పోతున్నదోనని.. మనమంతా ఆలోచించాల్సిన అవసరముంది. సామాన్య మానవులు ఏ విధంగా బ్రతకాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది. అదేవిధంగా, మా నిర్మాణ రంగం కూడా ఆలోచించదగ్గ విషయమిది. ఇలా అనూహ్యంగా రేట్లు పెరగడానికి కొన్ని కారణాలున్నాయి. గత పదేళ్ల నుంచి హైదరాబాద్‌తో పాటు మిగతా టౌన్లకు సంబంధించిన మాస్టర్ ప్లాన్లు అందుబాటులోకి రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న మాస్టర్ ప్లాన్లలో అవసరం లేని కొన్ని జోన్లను పెట్టడం వల్ల మిగతా జోన్లలో ఎక్కడ్లేని డిమాండ్ పెరుగుతోంది.