- రియల్ రంగంలో ఏ నగరానికి పై చేయి
ఐటీ రంగానికి సంబంధించి బెంగళూరు, హైదరాబాద్ నగరాల మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా రియల్ రంగంలోనూ ఈ రెండు నగరాల మధ్య పోటీ వస్తోంది. రియల్ పరంగా ఏ నగరం ఉత్తమం అనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కోకాపేటలో ఎకరం భూమి ధర రూ.100 కోట్లు పలకడంతో ఇది మరింత ఎక్కువైంది. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలా లేక బెంగళూరును ఎంచుకోవాలా అనే ప్రశ్నలు తల్తెత్తున్నాయి. నిజానికి ఏ నగరానికైనా అక్కడ జీవన వ్యయం ఎంత అవుతుందనేది కీలకం. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ లో జీవన వ్యయం 26 శాతం తక్కువని అంచనా.
బెంగళూరును సిలికాన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నప్పటికీ.. జీవన వ్యయం తక్కువ అనే కారణం పలువురిని హైదరాబాద్ వైపు మొగ్గేలా చేస్తుంది. గత ఐదేళ్లలో హైదరాబాద్ లో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం పెరిగాయి. ఈ విషయంలో బెంగళూరు, ముంబైలు 27 శాతంతో ఉండటం గమనార్హం. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో బెంగళూరులో రెసిడెన్షియల్ ప్రాపర్టీల విక్రయాలు 2 శాతం క్షీణించగా.. హైదరాబాద్ లో 5 శాతం పెరిగాయి. బెంగళూరులో ఆఫీస్ డిమాండ్ సైతం 10 శాతం పడిపోయింది.