ఎన్నికలలోపు ఎలాగైనా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు సమకూర్చాలనో.. మరే ఇతర కారణమో తెలియదు కానీ.. హెచ్ఎండీఏ యమస్పీడుగా ప్లాట్లను వేలం వేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలున్నాయో లెక్కగట్టి మరీ వేలం వేస్తున్నదని సామాన్య ప్రజానీకానికీ అర్థమవుతోంది. ఈ క్రమంలో హెచ్ఎండీఏకు మోకిలలో నాలుగో రోజు వేలానికి గట్టి షాకే తగింది. సోమవారం జరిగిన వేలంలో అరవై ప్లాట్లను విక్రయించినప్పటికీ.. గజం ధర మాత్రం గరిష్ఠంగా రూ.66 వేలకింది. కనిష్టంగా రూ.49వేలు చొప్పున అమ్ముడైంది. మొదటి రోజు వేలంలో గజం రూ. లక్ష పలికిన రేటు మరుసటి రెండు రోజుల్లో రూ.70 వేల దాకా పలికింది. ఇక, నాలుగో రోజు అయితే మరీ దారుణంగా రూ.66 వేలే పలికింది. మరి, మంగళవారం రేటు తగ్గుతుందా? లేక పెరుగుతుందా అనే ఆత్రుత రియల్ రంగంలో నెలకొంది.
వాస్తవానికి, మోకిల వేలం పాటలు జరగక ముందు.. అక్కడి కొన్ని ప్రాంతాల్లో గజం ధర రూ.35 నుంచి రూ.40 వేలు మాత్రమే ఉండింది. ఆ రేటుకూ కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ప్రజలు ఆలోచించేవారు. కానీ, హెచ్ఎండీఏ వేలం పాటల తర్వాత ఆయా ప్లాట్లు ఠక్కున అమ్ముడవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. భవిష్యత్తులో వాటి ధర పెరుగుతుందని అంచనా వేయడమే.
స్థానిక రియల్టర్లు, మధ్యవర్తులు కలిసి పనిగట్టుకుని వేలంలో అధిక ధరకు ప్లాట్లను కొంటున్నారని.. కానీ, అలాంటి వారంతా మిగతా సొమ్మును కట్టడం లేదని తెలిసింది. ముఖ్యంగా వేలం పాటలో ప్లాట్లు కొనుక్కున్న వ్యక్తులు.. వెంచర్‌లోకి వెళ్లి తమ ప్లాట్లకు ఇరువైపులా ఎవరు కొన్నారని అడిగితే.. వాళ్లు ఇంకా పూర్తి సొమ్ము కట్టలేదని హెచ్ఎండీఏ సిబ్బంది సమాధానమిస్తున్నారని సమాచారం. కొందరైతే వేలంలో పాల్గొనడానికి చెల్లించిన రూ.లక్ష కోల్పోయారని తెలిసిందని బయ్యర్లు చెబుతున్నారు. అందుకే, వేలం పాటలో పాల్గొనేవారి ఈఎండీ సొమ్మును రూ. లక్ష బదులు పది లక్షలు చేయాలని బయ్యర్లు అంటున్నారు. అప్పుడే ఇలాంటి మధ్యవర్తులు వేలం పాటలో పాల్గొనకుండా నిరోధించవచ్చని చెబుతున్నారు.
This website uses cookies.