Categories: ReraTOP STORIES

మూడు సంస్థ‌ల‌కు రెరా షోకాజ్ నోటీసు

* మ‌రి జేఎల్ఎల్ కు నోటీసు ఎప్పుడు?

రెరా నిబంధనలు ఉల్లంఘించిన మరో మూడు రియల్ ఎస్టేట్ సంస్థ‌ల‌కు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసి 15 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాల‌ని టీఎస్ రెరా ఛైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ ఆదేశించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ సుమారు తొమ్మిది సంస్థ‌ల‌కు రెరా షోకాజ్ నోటీసును జారీ చేసింది. వివ‌రాల్లోకి వెళితే..

నాగోల్ ఎక్స్ రోడ్డులోని సుప్రజ ఆసుపత్రి సమీపంలో నాని డెవలపర్స్ పేరుతో కార్యాలయం ప్రారంభించి, రెరా రిజిస్ట్రేషన్ లేకుండా.. శ్రీ లక్ష్మీనరసింహ కంట్రీ -3 పేరుతో ఆలేరు, యాదాద్రిలో వెంచర్ల‌ను ఆరంభించి.. కరపత్రాలు బ్రోచర్ల ద్వారా కొనుగోలుదారులను ఆకర్షిస్తూ ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించ‌డం చ‌ట్ట‌రీత్యా నేరం కాబ‌ట్టి షోకాజ్ నోటీసును జారీ చేశారు. ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ కాలనీకి చెందిన ఆర్నా ఇన్ఫ్రా డెవలపర్స్.. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా మహేశ్వరం వద్ద ఓపెన్ ప్లాట్లను విక్ర‌యించ‌డానికి బ్రోచర్ల ద్వారా విస్తృత ప్రచారాన్ని నిర్వ‌హించ‌డం వ‌ల్ల షోకాజ్ నోటీసునిచ్చారు. క‌ర్మాన్‌ఘాట్‌లోని మంద మల్లమ్మ ఎక్స్ రోడ్డుకు చెందిన అష్యూర్డ్ ప్రాప‌ర్టీ ప్రైవేట్ లిమిటెడ్‌.. రెరా ప‌ర్మిష‌న్ లేకుండా నాగార్జునసాగర్ హైవే చింతపల్లి, శ్రీశైలం హైవే ఆమనగల్ ప్రాంతంలో ఆరంబు, అరణ్య పేర్ల‌తో ఓపెన్ ప్లాట్లను బహిరంగంగా విక్ర‌యిస్తున్నందుకు షోకాజ్ నోటీసును జారీ చేశారు. రెరా చట్టం ప్రకారం.. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఎలాంటి ప్రకటనల్ని జారీ చేయరాదని, నిబంధనల‌ను అతిక్రమించే ప్ర‌మోట‌ర్ల‌పై చట్టరీత్యా చ‌ర్య‌ల్ని తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ఐదు ల‌క్ష‌ల చెక్కులు తీసుకోవ‌డం క‌రెక్టునా?
రెరా అనుమ‌తి లేకుండా బుద్వేల్ చేరువ‌లోని ఉమ్దా న‌గ‌ర్‌లో ప్రెస్టీజ్ సిటీలో ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్న జేఎల్ఎల్ సంస్థ‌పై రెరా ఎందుకు షోకాజ్ నోటీసును జారీ చేయ‌డం లేద‌ని న‌గ‌రానికి చెందిన ప‌లువురు బిల్డ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. రెరా ప‌ర్మిష‌న్ తీసుకోకుండా.. కొనుగోలుదారుల నుంచి రూ. 5 ల‌క్ష‌ల చెక్కును తీసుకోవ‌డం ఎంత‌వ‌ర‌కూ క‌రెక్టు అని నిల‌దీస్తున్నారు. బిల్డ‌ర్ ఎలాంటివాడైనా.. ఎంత పెద్ద సంస్థ అయినా రెరా నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించినందుకు క‌ఠిన చ‌ర్య‌ల్ని తీసుకోవ‌డానికి ముక్త‌కంఠంతో కోరుతున్నారు.

This website uses cookies.