చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడితే.. అధిక రాబడి వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు పోస్టాఫీసు పథకాలు, పీపీఎఫ్ వంటివి ఉండనే ఉన్నాయి. వాటిలో మదుపు చేస్తే.. మన సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది. అందుకే, మనలో చాలామంది సామాన్యులు.. నెలకు వంద నుంచి ఐదు వందలు లేదా వెయ్యి రూపాయల్ని పెట్టుబడి పెడతారు. వీరికి ఎంతలేదన్నా సుమారు ఆరు శాతం దాకా వడ్డీ గిట్టుబాటు అవుతుంది. కానీ, లక్షల రూపాయల్ని పెట్టుబడి పెట్టమనడం.. అధిక ఆదాయం వస్తుందని మభ్య పెట్టడం ఎంతవరకూ సమంజసం? ఇది సెబీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. కానీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇందుకు విరుద్ధమైన రీతిలో ప్లాట్లు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాల్ని విక్రయిస్తున్నారు.
వంద శాతం పెట్టుబడి పెడితే గ్యారెంటీ రిటర్న్స్ అంటున్నారు.. మరి, రెరా అనుమతి లేకుండా.. ఇలాంటి ఆఫర్లను ఎలా ప్రకటిస్తున్నారు? ఇలాంటి అక్రమార్కుల్ని అరికట్టేందుకు రెరా యంత్రాంగం ఏం చేస్తోంది? తాజాగా, ఐరా రియాల్టీ అనే సంస్థ.. సమృద్ధి యొక్క అలలను ప్రారంభిద్దాం అంటూ కొనుగోలుదారుల్ని, పెట్టుబడిదారుల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. కొండలు, గుట్టల్ని చూపెట్టి.. ఆకర్షీణయమైన బ్రోచర్‌ను ముద్రించి.. ఓ 150 ఎకరాల ప్రాజెక్టును అమ్మేసి.. ఓ రూ.300 కోట్లను కొల్లగొట్టాలనే బడా స్కెచ్ వేసింది.
హైటెక్ సిటీ నుంచి ముప్పయ్ కిలోమీటర్ల దూరంలోని శంకర్ పల్లి మోమిన్‌పేట్ రోడ్డులో చీమలదారి ప్రాంతంలోని బంజరు భూమిలో విలాసవంతమైన గృహాల్ని నిర్మించాలన్నది ఐరా రియాల్టీ ప్రధాన ఉద్దేశ్యం. వినడానికిది ఎంతో వినసొంపుగా ఉంది. అక్కడ పర్యావరణ అనుకూలమైన గృహాల్ని నిర్మించాలనేది సంస్థ లక్ష్యం. లక్ష్యం మంచిదే.. ఎవరూ కాదనలేరు.. నగరానికి దూరంగా ప్రశాంతంగా నివసించాలని కోరుకునేవారికి ఇది చక్కగా పనికొస్తుంది. కాకపోతే, ఇంతటీ బడా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించుకున్నప్పుడు.. ప్రజల్నుంచి పెట్టుబడి రూపంలో సొమ్మును సమీకరించాలని అనుకున్నప్పుడు.. హెచ్ఎండీఏ/ డీటీసీపీ రెరా అథారిటీ అనుమతి తీసుకుంటే ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు. కొనుగోలుదారులూ ఎంచక్కగా కొనుక్కుంటారు. కాకపోతే, రెరా అనుమతి లేకుండా ఎలాంటి అమ్మకాలు చేయకూడదు. ఫలానా ప్లాటు లేదా ఫ్లాటు అమ్ముదామని ఎవరికీ చెప్పకూడదు. ప్రాజెక్టు గురించి ప్రకటనల్ని విడుదల చేయకూడదు. కానీ, ఐరా రియాల్టీ ఏం చేస్తోంది?
ఇంటర్నెట్ నుంచి విదేశీ బొమ్మల్ని తీసుకుని.. రకరకాల డిజైన్లను సేకరించి.. ఒక చూడచక్కటి బ్రోచర్‌ని సిద్ధం చేసింది. తమ కలల ప్రాజెక్టును ఇదిగో ఇలా అభివృద్ధి చేస్తామని కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల ముందు ఉంచింది. ఈ విషయాన్ని కొందరు బయ్యర్లు రియల్ ఎస్టేట్ గురు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించగా.. ఐరా రియాల్టీ అనే సంస్థ రెరా అనుమతి తీసుకోలేదని అర్థమైంది. ఈ సంస్థ ప్రకారం.. రానున్న రోజుల్లో డీటీసీపీ అనుమతి తీసుకుంటారు. దాదాపు 150 ఎకరాల్లో ప్రపంచ స్థాయి విల్లాలు, అల్ట్రా ప్రీమియం అపార్టుమెంట్లు, హెచ్ఎండీఏ లేఅవుట్లను అభివృద్ధి చేస్తారు. ఒక్కో ప్లాటును 600, 1200 గజాల్లో విక్రయిస్తారు.
ప్రస్తుతం అక్కడ చదరపు అడుక్కీ రూ.12 నుంచి 15 వేల వరకూ గజం ధర ఉంది. కాకపోతే, ఐరా రియాల్టీ సంస్థ చదరపు గజానికి రూ.8,500 చొప్పున ఇక్కడి ప్లాట్లను విక్రయిస్తోంది. 150 ఎకరాల్లో యాభై శాతాన్ని మినహాయిస్తే.. మిగతా 75 ఎకరాల్లో లేఅవుట్‌ని అభివృద్ధి చేస్తుందని అనుకుందాం. అంటే, 3,63,000 గజాల స్థలాన్ని అభివృద్ధి చేస్తుంది. దీన్ని గజం రూ.8,500 చొప్పున లెక్కిస్తే.. దాదాపు రూ.308 కోట్లను వసూలు చేస్తోందన్నమాట. ఇందులో సగం ప్లాట్లు అమ్ముడైనా ఈ కంపెనీ ఎంతలేదన్నా కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల నుంచి సుమారు 150 కోట్లను వసూలు చేయడం పక్కా అన్నమాట. ఇలాంటివి ఎన్ని సంస్థలు.. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో.. ప్రజల్నుంచి ఇంత అక్రమంగా సొమ్ము వసూలు చేస్తున్నాయా? మరి, రెరా అనుమతి లేకుండా ఇన్ని కోట్ల రూపాయల్ని అక్రమంగా వసూలు చేయవచ్చా? విజ్ఞులైన నిర్మాణ సంఘాల పెద్దలు, పురపాలక శాఖ అధికారులు, రెరా యంత్రాంగమే దీనికి సమాధానమివ్వాలి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరుచుకుని ఇలాంటి అక్రమ రియల్ సంస్థలపై కొరడా ఝళిపించాలి.