Categories: TOP STORIES

లవ్ ఎట్ ఫస్ట్ సేల్..

  • కొనుగోలుదారులను ఆకర్షించడానికి అతివల ఎర
  • చైనాలో వెలుగుచూసిన ఓ డెవలపర్ మోసం

తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చైనా రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిన పెట్టేందుకు చేపడుతున్న చర్యలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వని నేపథ్యంలో ఓ డెవలపర్ తన మార్కెటింగ్ వ్యూహాలకు పదును పెట్టారు. అతివలను ఎరగా వేసి పలువురు పురుషులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయిలు కొందరు పురుషులను లక్ష్యంగా చేసుకుని నెమ్మదిగా పరిచయం పెంచుకున్నారు. అనంతరం ప్రేమించేలా చేసుకున్నారు. తర్వాత మనకు ఓ ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి వారి ద్వారా కొనుగోళ్లు చేయించారు. చివరకు అదంతా మోసమని..

ఆ అతివలంతా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అని తెలుసుకున్న బాధితులు నోరెళ్లబెట్టారు. 31 మంది ఈ విధంగా మోసపోయారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన 15 మంది అమ్మాయిలు తమ పథకాన్ని విజయవంతంగా అమలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఏ మాత్రం అనుమానం లేకుండా పురుషులను తమ వలలోకి లాగడానికి వారంతా డేటింగ్ యాప్ వినియోగించారు. తీయని మాటలతో ఆకర్షించి.. ప్రియురాళ్లలాగే నటించారు. అదంతా నిజమేనని భ్రమపడిన బాధితులు వారు చెప్పినట్టే చేసి.. రియల్ ఉచ్చుకు చిక్కారు.

వాస్తవానికి గత నాలుగేళ్లుగా చైనా రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర తిరోగమనంతో పోరాడుతోంది. ఒకప్పుడు నమ్మకమైన పెట్టుబడిగా భావించిన రియల్ రంగం తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. గృహ అమ్మకాలు క్షీణించాయి. లక్షలాది ప్రాపర్టీలు అమ్ముడుపోలేదు. 2021 నుంచి చైనాలోని అతిపెద్ద నగరాల్లో దాదాపు 10 శాతం ఏజెన్సీలు మూతపడ్డాయి. చిన్న పట్టణాల్లో కూడా తీవ్ర క్షీణత కనిపించింది. ఈ నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉండటం, కొనుగోలుదారులు తక్కువగా ఉండటంతో కొంతమంది ఏజెంట్లు, డెవలపర్లు విపరీత చర్యలు ప్రారంభించారు. కస్టమర్లను ఆకర్షించడానికి ప్రోత్సాహకాలు మొదలుపెట్టారు. జెజియాంగ్ ప్రావిన్స్ లోని ఒక కంపెనీ.. తమ దగ్గర ఇల్లు కొంటే 10 గ్రాముల బంగారం ఇస్తామని ప్రకటించగా.. బీజింగ్‌కు చెందిన ఒక డెవలపర్ రాజధానిలో నేరుగా నగదు చెల్లించి అపార్ట్ మెంట్ కొంటే యాంటైలో ఉచిత హాలిడే హోమ్‌ ఇస్తామని ఆఫరిచ్చాడు.

అలాగే ఉచిత ఐఫోన్‌లు, ప్రైవేట్-జెట్ కంపెనీలో వాటాలు వంటి ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు. మరోవైపు కొంతమంది డెవలపర్లు ధరల తగ్గింపులను అసంబద్ధ స్థాయికి తీసుకెళ్లారు. దక్షిణ చైనాలోని జోంగ్‌షాన్ నగరంలో ఒక బిల్డర్ కొనుగోలుదారులు 9.90 యువాన్ (1.30 డాలర్ల) కంటే తక్కువ డిపాజిట్‌తో అపార్ట్ మెంట్‌లను కొనొచ్చని ప్రకటించాడు. హెనాన్‌లో వ్యవసాయ ఉత్పత్తులను డౌన్ పేమెంట్‌లుగా అంగీకరించారు. దీని ఫలితంగా సెంట్రల్ చైనా గ్రూప్ అనే డెవలపర్ 2022లో 30 అపార్ట్ మెంట్‌లకు బదులుగా 430 టన్నుల వెల్లుల్లిని సేకరించింది. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఓ డెవలపర్ అమ్మాయిలను ఎరగా వేసి ఇలాంటి కొనుగోలు వ్యూహం అమలు చేశాడు.

This website uses cookies.