Categories: TOP STORIES

ఆఫీస్‌ స్పేస్ లీజింగ్ అదిరింది

  • దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 74 శాతం పెరుగుదల
  • 2025 తొలి త్రైమాసికంపై నైట్ ఫ్రాంక్ నివేదిక

దేశంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ చక్కని వృద్ధి కనబరిచింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 74 శాతం వృద్ధితో 282 లక్షల చదరపు అడుగులకు చేరినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తన ‘ఇండియా రియల్ ఎస్టేట్: ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ రిపోర్ట్’ లో పేర్కొంది. నగరాలవారీగా చూస్తే.. బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 35 లక్షల చదరపు అడుగుల నుంచి 2 రెట్లు పెరుగుదలతో 127 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. హైదరాబాద్‌లో ఆఫీసు డిమాండ్ 30 లక్షల చదరపు అడుగుల నుంచి 31 శాతం పెరిగి 40 లక్షల చదరపు అడుగులకు పెరిగింది.

పూణేలో 19 లక్షల చదరపు అడుగుల నుంచి 37 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. ముంబైలో 28 లక్షలు చదరపు అడుగుల నుంచి 24 శాతం వృద్ధితో 35 లక్షల చదరపు అడుగులకు చేరింది. చెన్నైలో స్థూల లీజింగ్ 56 శాతం పెరిగి 12 లక్షల చదరపు అడుగుల నుంచి 18 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. అయితే, ఢిల్లీలో లీజింగ్ 33 శాతం మేర తగ్గి.. 31 లక్షల చదరపు అడుగుల నుంచి 21 లక్షల చదరపు అడుగులకు దిగిపోయింది. అలాగే అహ్మదాబాద్‌లోనూ డిమాండ్ 54 శాతం పడిపోయింది. ఇక్కడ 5 లక్షల చదరపు అడుగుల నుంచి 2.2 లక్షలు చదరపు అడుగులకు తగ్గింది. కోల్‌కతాలో కార్యాలయ స్థలాల స్థూల లీజింగ్ 2025 జనవరి-మార్చిలో 16 శాతం తగ్గి 2 లక్షల చదరపు అడుగుల నుంచి 1.6 లక్షల చదరపు అడుగులకు తగ్గిపోయింది.

జీసీసీలు, బీఎఫ్ఎస్ఐ, టెక్నాలజీ సంస్థలు, డేటా సెంటర్ల నుంచి బలమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో భారత్ లో ఆఫీస్ లీజింగ్ మంచి వృద్ధి కనబరుస్తోందని నివేదిక తెలిపింది. “క్యూ 1 2025 భారత ఆఫీస్ స్పేస్ కి అసాధారణమైన కాలం. జీసీసీల డిమాండ్ స్థిరంగా కొత్త గరిష్టాలను తాకుతోంది. ఫలితంగా దీర్ఘకాలిక పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది’’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ చెప్పారు.

This website uses cookies.