కోత్వాల్ గూడ ఎకో పార్క్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్వాల్ గూడ ఎకో పార్కు ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. హైదరాబాద్ సిటీ పర్యాటకానికి పెద్ద పీట వేస్తూ భారత దేశంలో ఇంతకు ముందు ఎక్కడా లేని విధంగా అత్యాధునిక పర్యాటక క్షేత్రాన్ని కొండలు, గుట్టల మధ్య నిర్మిస్తోంది రేవంత్ సర్కార్. భాగ్యనగర శివారు ప్రాంతంలో నగర వాసులకు అద్భుతమైన వినోద కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఎకో పార్క్ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టగా.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేస్తోంది.
నగర ప్రతిష్టను పెంపొందించేలా ఔటర్ రింగు రోడ్డు పక్కన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఐటీ కారిడార్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగురోడ్డును ఆనుకొని ఉన్న సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్ గూడ ఎకో పార్కు రూపుదిద్దుకుంటోంది. ఇందులో ఆకర్షణీయమైన ల్యాండ్ స్కేపింగ్, గుట్టల మధ్య హాయిగా నడిచేందుకు బోర్డు వాక్‌తో పాటు దేశంలోనే అతి పెద్ద అక్వేరియం, పక్షిశాల కేంద్రాల నిర్మాణాన్ని డెవలప్ చేస్తారు.
హైదరాబాద్ శివారులో బుద్వేల్ పక్కనే ఉన్న కొత్వాల్ గూడ పార్కును ఆనుకొని హిమాయత్‌సాగర్ జలాశయం ఏడాది పొడవునా నిండుగా ఉంటుంది. దీంతో వేలాది మంది ఈ జలాశయాన్ని సందర్శిస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో హెచ్‌ఎండీఏ చేపట్టిన ఎకో పార్కుతో ఎంతో మందికి ఆటవిడుపుగా మారనుంది.
అంతర్జాతీయస్థాయిలో ఈ పార్క్ అభివృద్ది, ఇతర నిర్మాణాలను రూ.300 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. ఇక్కడ కనీవినీ ఎరుగని రీతిలో అతిపెద్ద అక్వేరియం, బోర్డు వాక్, ల్యాండ్ స్కేపింగ్, పక్షిశాలను ఏర్పాటు చేస్తారు. కోత్వాల్ గూడ ఎకో పార్కు ప్రకృతి చెంత గడపాలని అనుకునే వారి బెస్ట్ డెస్టినేషన్ గా మారనుంది.
ఆరు ఎకరాల్లో ఏర్పాటయ్యే పక్షిశాల సీతాకోక చిలుక ఆకృతిలో ఉంటుంది. ఆస్ట్రేలియా, పెరు, అమెరికా, అర్జెంటీనా, న్యూజిలాండ్స్, చైనా, జపాన్ తదితర దేశాలకు చెందిన అరుదైన సుమారు 200 నుంచి 300 రకాల పక్షులకు కేంద్రం అవుతుంది. ఇక ఎకో పార్క్ లో అక్వేరియం మరో అట్రాక్షన్ అని చెప్పవచ్చు. సముద్ర జీవుల కోసం ఇక్కడ అతిపెద్ద అక్వేరియం ను ఏర్పాటు చేస్తున్నారు.
అంతే కాకుండా పిక్నిక్ పార్క్, అత్యాధునిక సౌకర్యాలతో రిసార్ట్, అడ్వెంచర్ జోన్, ఫుడ్ కోర్టులు, ఓపెన్ ఎయిర్ థియేటర్, పర్యాటకులు బస చేసేందుకు పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో కాటేజీలు, ఉద్యానం చుట్టూ గోడలపై పక్షులు, జంతువుల బొమ్మలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.