- రేవంత్ సర్కార్ బృహత్ ప్రణాళికలు
- పూర్తయితే సరికొత్త రికార్డే..
గ్రేటర్ హైదరాబాద్ ను మరింత అభివృద్ది చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరీ ముఖ్యంగా మహా నగరంలో మౌలిక వసతుల ఏర్పాటుకు రేవంత్ సర్కార్ భారీ ప్రణాళికల్ని సిద్దం చేసింది. భాగ్యనగరంలో తాగునీటి నుంచి మొదలు అండర్ పాస్ లు, ఫ్రై ఓవర్ లు, స్కై వేస్, ట్రాఫిక్ జంక్షన్లు.. ఇలా పలు మౌలిక వసతుల అభివృద్దికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాలన్నీ ప్రణాళికబద్దంగా పూర్తయితే.. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో రియాల్టీకి గిరాకీ పెరిగే అవకాశముంది.
గ్రేటర్ సిటీలో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడానికి.. సుమారు రూ.6 వేల కోట్ల రూపాయలతో చేపట్టే.. పలు అభివృద్ది కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఆరు మురుగునీటి శుద్ధి కేంద్రాలతో పాటు ఓఆర్‌ఆర్ వరకు ఉన్న ప్రాంతాల్లో ఏర్పడే మురుగునీటిలో 75 శాతం శుద్ధి కానుంది. ఇప్పటివరకు నగరంలో 29 మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా రోజుకి.. 898 ఎంఎల్‌డీల మురుగు శుద్ధి అవుతుండగా.. రూ.767 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మరో ఆరు ఎస్టీపీలతో రోజుకి 527 ఎంఎల్‌డీల మురుగు శుద్ధి కానుంది. ఇప్పటివరకూ అంబర్‌పేటలో 339 ఎంఎల్‌డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ నగరంలో అతిపెద్దది కాగా.. తాజాగా 320 ఎంఎల్‌డీల సామర్థ్యంతో నాగోల్‌లో ప్రారంభమైన ఎస్టీపీ రెండో అతిపెద్దది.
నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.826 కోట్లతో ఆరు జంక్షన్లను అభివృద్ధికి సంబంధించిన పనులను సీఎం శంకుస్థాపన చేశారు. హెచ్‌సీఐటీఐ ప్రాజెక్టులో భాగంగా వీటిని రెండు ప్రాజెక్టులుగా జీహెచ్‌ఎంసీ అభివృద్ధి చేస్తోంది. మొదటి ప్యాకేజీలో రూ.421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు. రెండో ప్యాకేజీలో రూ.405 కోట్లతో రోడ్ నెం.45 జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికల్ని రూపొందించారు.
- ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో మెరుగైన నీటి సరఫరా కోసం జలమండలి మంజూరు చేసిన 71 రిజర్వాయర్లలో ఇప్పటికే కొన్ని ప్రారంభం కాగా మరో 20 రిజర్వాయర్‌లు అందుబాటులోకి వచ్చాయి. రాజీవ్ రహదారిపై ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు 18.124 కి.మీ పొడవుతో ఎలివేటెడ్ కారిడార్ కోసం రూ. 3,619 కోట్లు ఖర్చు చేస్తారు. జాతీయ రహదారి 44పై ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీఫాం వరకు రూ.1487 కోట్ల వ్యయంతో 5.32 కి.మీ. పొడవుతో మరో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మిస్తున్నారు.
- బెంగళూరు జాతీయ రహదారిని చింతల్ మెట్ రోడ్డుకు అనుసంధానం చేసేలా.. మిరాలం ట్యాంకు మీదుగా రూ.363 కోట్ల వ్యయంతో 4 లైన్ల హైలెవల్ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 28.15 కోట్ల వ్యయంతో మరో నాలుగు రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
- హెచ్‌ఎండీఏ పరిధి ఏడు జిలాల్లో 2024లో 7.5 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా, 4.56 కోట్ల మొక్కలను నాటి 60 శాతం లక్ష్యాన్ని సాధించారు. ఇక హైదరాబాద్ లో రూ.53.62 కోట్ల వ్యయంతో 9 చెరువుల సుందరీకరణ పనులు చేపడుతున్నారు. రూ.41 కోట్ల వ్యయంతో రెండు పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. రూ.48 కోట్ల వ్యయంతో తెల్లాపూర్‌లో తెలంగాణ ట్రిబ్యూట్ గార్డెన్ ఏర్పాటు కానుంది. వచ్చే నాలుగేళ్లలో ఈ అభివృద్ది కార్యక్రమాలు పూర్తయితే హైదరాబాద్ మరో లెవల్ కు వెళ్లే అవకాశముంది.