- ఏపీ సర్కారుకు క్రెడాయ్ ఏపీ వినతి
ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ కు పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకురావాలని క్రెడాయ్ ఏపీ అభిప్రాయపడింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విన్నవించామని క్రెడాయ్ ఏపీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగంగా ఉన్న రియల్ రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ఉచిత ఇసుక విధానం తోడ్పడుతుందన్నారు. స్టీల్, ఇసుక, సిమెంట్ ధరల పెరుగుదలతో ఏపీ రియల్ రంగం సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపారు.
ఇప్పుడిప్పుడే రియల్ రంగం గాడిన పడుతోందని, ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక విధానం తీసుకొస్తే చాలా ప్రయోజనంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భవన నిర్మాణ అనుమతుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఇంపాక్ట్ ఫీజు రియల్ ఎస్టేట్ డెవలపర్లపై పెనుభారంగా మారిందని క్రెడాయ్ ఏపీ అధ్యక్షుడు వైవీ రమణారావు పేర్కొన్నారు. కాగా, క్రెడాయ్ రాజమహేంద్రవరం చాప్టర్ కు కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. గౌరవ చైర్మన్ గా బుడ్డిగ శ్రీనివాసులు, చైర్మన్ గా సూరవరపు శ్రీనివాస్ కుమార్, అధ్యక్షుడిగా మన్యం సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు.