- మధురవాడలో రూ.2300 కోట్ల వ్యయం..
- ఏర్పాటుకు ఏపీ సర్కారు సన్నాహాలు
- బిడ్లు ఆహ్వానించిన ఏపీఐఐసీ
దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని, సీఎం క్యాంపు కార్యాలయం కూడా అక్కడకు మారుతుందని ప్రకటించిన ఏపీ సర్కారు.. విశాఖ అభివృద్ధికి మరింత వడివడిగా అడుగులు ముందుకేస్తోంది. ఇప్పటికే విఖాలో అదానీ డేటా సెంటర్ తోపాటు ఐటీ పార్క్, రహేజా గ్రూప్ ఇనార్బిట్ మాల్, ఐటీ పార్కు ఏర్పాటు చేస్తుండగా.. తాజాగా మరో భారీ ఐటీ బిజినెస్ పార్కు ఏర్పాటుకు ఏపీ సర్కారు సన్నాహాలు ప్రారంభించింది. మధురవాడ హిల్ నెంబర్-3 మీద 18.93 ఎకరాల స్థలంలో ఐ-స్పేస్ పేరుతో ఈ ఐటీ బిజినెస్ పార్కును పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) బిడ్లు ఆహ్వానించింది.
ఐటీ, ఐటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించుకునే సంస్థలకు అనుగుణంగా వాణిజ్య సముదాయాలతోపాటు సమావేశ మందిరాలు, బిజినెస్ హోటల్స్, సర్వీస్ అపార్ట్ మెంట్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్ అండ్ బేవరేజెస్, పార్కింగ్ వంటి సదుపాయాలు ఉండేలా మొత్తం రూ.2300 కోట్ల వ్యయంతో దీనిని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఏపీఐఐసీ 26 శాతం వాటా కలిగి ఉండగా.. భాగస్వామ్య కంపెనీ 74 శాతం వాటా కలిగి ఉంటుంది. మొత్తం రూ.2300 కోట్లలో 40 శాతం మొత్తాన్ని ఈక్విటీగా సమకూర్చాలి. ఈ మేరకు ఏపీఐఐసీ రూ.239 కోట్లు, భాగస్వామ్య కంపెనీ రూ.681 కోట్లు వెచ్చిస్తాయి. మిగిలిన రూ.1380 కోట్లను రుణంగా సేకరిస్తారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, బ్రాండింగ్, నిర్వహణ అంతా భాగస్వామ్య కంపెనీయే చూడాల్సి ఉంటుంది.