Categories: TOP STORIES

గేటెడ్ క‌మ్యూనిటీల్లో స‌రికొత్త ర‌చ్చ‌..

  • హైద‌రాబాద్ క‌మ్యూనిటీల్లో కొత్త స‌మ‌స్య‌
  • ఆర్‌డ‌బ్ల్యూఏ క‌మిటీల్లో అప‌న‌మ్మ‌కం..
  • ముగ్గురు, న‌లుగురే స‌మ‌స్యాత్మ‌కం
  • వీరిని సంఘ పెద్ద‌లే దారిలోకి తేవాలి
  • ఇగో వ‌ద్దు.. చ‌ర్చ‌లే ముద్దు..

హైద‌రాబాద్‌లోని ప‌లు గేటెడ్ క‌మ్యూనిటీల్లో స‌రికొత్త స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతున్నాయి. కొన్ని చోట్ల డెవ‌ల‌ప‌ర్లు స‌కాలంలో ప్రాజెక్టును పూర్తి చేయ‌క‌పోవ‌డ‌మో కార‌ణం కాగా.. మ‌రికొన్నింట్లో కొనుగోలుదారులే బిల్డ‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. ఇంకొన్ని క‌మ్యూనిటీల్లో నివాసితులు రెండు వ‌ర్గాలుగా చీలిపోయి ఒక‌రి మీద మ‌రొక‌రు కేసులు పెట్టుకుంటున్నారు. రెరా ఏర్ప‌డిన త‌ర్వాత నివాసితుల సంఘాన్ని డెవ‌ల‌ప‌రే స్వ‌యంగా ఏర్పాటు చేయాల‌న్న‌ది నిబంధ‌న‌. కాక‌పోతే, కొన్ని క‌మ్యూనిటీల్లో కొనుగోలుదారుల వ‌ల్ల స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతున్నాయి.

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో విచిత్ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కొంద‌రు బిల్డ‌ర్లు ఫ్లాట్ల‌ను క‌ట్ట‌కుండా చేతులెత్తేస్తుంటే బ‌య్య‌ర్లు క‌ష్టాలు ఎదుర్కొంటున్నారు. మ‌రికొంద‌రు బిల్డ‌ర్లేమో క‌రోనాను తట్టుకుని క‌ష్ట‌ప‌డి నిర్మాణాల్ని పూర్తి చేస్తుంటే.. కొంద‌రు కొనుగోలుదారులు కావాల‌ని ర‌చ్చ‌ర‌చ్చ చేస్తున్నారు. ఫ‌లానా స‌దుపాయం స‌రిగ్గా లేదు.. ఈ సౌక‌ర్యం మెరుగ్గా లేదంటూ వాదిస్తున్నారు. మొత్తం క‌మ్యూనిటీలో ఓ ముగ్గురు, న‌లుగురు వ్య‌క్తులే.. ప్ర‌తిదాన్ని వివాదాస్ప‌దం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. అటు డెవ‌ల‌ప‌ర్ల‌కు ఇటు తోటి నివాసితుల‌కు ప్ర‌త్యక్ష న‌ర‌కం చూపిస్తున్నారు.

మియాపూర్‌లో ఇలా..

అది మియాపూర్‌లోని హుడా మ‌యూరి న‌గ‌ర్‌. ఒక బిల్డ‌ర్ బ‌డా గేటెడ్ క‌మ్యూనిటీ నిర్మించాడు. వాస్త‌వానికి, హైటెక్ సిటీ రాక ముందు.. మాదాపూర్ కంటే ముందే మియ‌పూర్‌లో భూముల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండేవి. అయినా, అక్క‌డ స్థ‌లం కొన్న డెవ‌ల‌ప‌ర్‌.. కొంత‌కాలం క్రితం ఒక బ‌డా గేటెడ్ క‌మ్యూనిటీని ఆరంభించాడు. ఈ స్థ‌లానికి కొంత దూరంలో ఆసియాలోనే అతిపెద్ద బ‌స్ టెర్మిన‌ల్ వ‌స్తుంద‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం ప్ర‌చారం చేసింది. దీంతో ఈ బిల్డ‌ర్ మ‌ల్టీప్లెక్స్‌, హాస్పిట‌ల్ వంటివి ఈ క‌మ్యూనిటీలో ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌చారం చేసిన మాట వాస్త‌వ‌మే. కాక‌పోతే, ఆ త‌ర్వాత బ‌స్ టెర్మిన‌ల్ రాక‌పోవ‌డం… మార్కెట్ మెరుగ్గా లేక‌పోవ‌డంతో బిల్డ‌ర్ కాస్త ఆల‌స్యంగా నిర్మిస్తాడేమో! ఈ విష‌యంలో డెవ‌ల‌ప‌ర్ నుంచి స్ప‌ష్ట‌త తీసుకోకుండా.. కొంద‌రు కొనుగోలుదారులు అపార్టుమెంట్ బాల్క‌నీలో బిల్డ‌ర్‌కి వ్య‌తిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల బిల్డ‌ర్‌కు తాత్కాలికంగా కొన్ని ఫ్లాట్లు అమ్ముడు కాక‌పోవ‌చ్చు.

కొనుగోలుదారుల‌కు డెవ‌ల‌ప‌ర్ ఇచ్చిన హామీలు నెర‌వేరాలంటే.. ఆయా ఫ్లాట్ల‌ను అమ్ముకుంటేనే క‌దా సాధ్య‌మ‌య్యేది. మ‌రి, అలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయ‌డంతో.. ఆయా గేటెడ్ క‌మ్యూనిటీని లిటిగేష‌న్‌లోకి ప‌డేసిన‌ట్లు అయ్యింది. దీంతో, అందులో కొన‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌ట్లేదు. దీని వ‌ల్ల కేవ‌లం బిల్డ‌ర్‌కు న‌ష్ట‌మే. కాక‌పోతే, అది తాత్కాలిక‌మే. త‌ను ఇప్పుడు కాక‌పోతే ఒక‌ట్రెండేళ్లకైనా ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తాడు. కాక‌పోతే, ఈ గేటెడ్ క‌మ్యూనిటీలో ఫ్లాట్ల విలువ ప‌డిపోతుంది. సెకండ్ సేల్ కోసం ఎవ‌రూ బ‌య్య‌ర్లు ముందుకు రాక‌పోవ‌చ్చు. కాబ‌ట్టి, ఇప్ప‌టికైనా తెలివైనా నివాసితుల సంఘం ఏం చేయాలంటే.. బిల్డ‌ర్‌తో చ‌ర్చించి.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాలి. అంతేత‌ప్ప‌, ఇలా ఫ్లెక్సీలు పెట్ట‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌ని గుర్తుంచుకోవాలి.

ఫేజుల వారీగా క‌డ‌తారు క‌దా!

ఇంటీగ్రేటెడ్ టౌన్‌షిప్ అంటేనే కాస్త పెద్ద ప్రాజెక్టు అని చెప్పుకోవాలి. సాధార‌ణంగా దీన్ని 50 లేదా 100 ఎకరాల్లో.. ఫేజుల వారీగా డెవ‌ల‌ప‌ర్లు అభివృద్ధి చేస్తారు. ఈ అంశం ప్ర‌తిఒక్క‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ఫేజుల వారీగా ప‌ని పూర్తి చేయ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. అందుకే, అన్ని ఫేజుల్లో నివ‌సించేవారు అర్థం చేసుకోవాలి. మొద‌టి ఫేజులో విల్లాలున్నాయి కాబ‌ట్టి, చివ‌రి ఫేజులోనూ విల్లాల్నే నిర్మించాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డం క‌రెక్టు కాదు. డెవ‌ల‌ప‌ర్లు ఎప్పుడైనా మార్కెట్ కండీష‌న్ బ‌ట్టి నిర్మాణాలు చేప‌డుతాడు కాబ‌ట్టి, డెవ‌ల‌ప‌ర్‌ను ఇబ్బంది పెట్ట‌క‌పోవ‌డ‌మే క‌రెక్టు. వాస్త‌వ ప‌రిస్థితుల్ని బేరీజు వేసుకుని.. బిల్డ‌ర్‌తో చ‌ర్చించి స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి సారించాలి. ప‌దేళ్ల క్రితం కొన్న విల్లా ధ‌ర కంటే ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న ప్లాట్ల విలువే ఎక్కువ కాబ‌ట్టి.. ప్ర‌తిఒక్క‌ర్ని గౌర‌వించాలి. ఒక క‌మ్యూనిటీని నిలబెట్ట‌డానికి డెవ‌ల‌ప‌ర్ ఎంత క‌ష్ట‌ప‌డ‌తాడో ఆలోచించాలి. కాబ‌ట్టి, వితండ‌వాదం చేయ‌కుండా, స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించుకోవాలి.

క‌మిటీలో ర‌చ్చ‌రచ్చ‌..

ఎర్ర‌గడ్డ‌లోని ఒక కొత్త గేటెడ్ క‌మ్యూనిటీ. కో ఆప‌రేటివ్ సొసైటీ కింద రిజిస్ట‌ర్ అయ్యింది. కాక‌పోతే, కొత్త క‌మిటీ ఏర్పాటు కాగానే.. సంఘ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ ఆరంభ‌మైంది. ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌లైంది. సాధార‌ణంగా కొత్త గేటెడ్ క‌మ్యూనిటీ ప్రారంభంలో.. క‌మిటీలో ఉండేవారి మ‌ధ్య అపోహ‌లు, అనుమానాలు వంటివి త‌లెత్తుతుంటాయి. కాక‌పోతే, స‌మ‌యం గ‌డిచే కొద్దీ అవ‌న్నీ స‌ద్దుమ‌ణుగుతాయి. నార్త్ ఇండియా నుంచి వ‌చ్చిన‌వారు కాస్త అగ్రెసివ్‌గా ఆలోచిస్తే.. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన‌వారు నెమ్మ‌దిగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. క‌మ్యూనిటీ రెండు, మూడు వ‌ర్గాలుగా విడిపోతుంది. ఇలాంట‌ప్పుడు, ఆయా క‌మ్యూనిటీ పెద్ద మ‌నుషులంతా కూర్చోని చ‌ర్చించుకుని స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి పెట్టాలి.

ఏం చేయాలి?

కొంద‌రు బిల్డ‌ర్ల‌కు మార్కెట్లో మంచి పేరు ఉంది. అలాంటి వారి పేరును బ‌ద్నాం చేయ‌కుండా.. నివాసితుల సంఘాలు తెలివిగా వ్య‌వ‌హ‌రించాలి. స‌మ‌స్య‌లుంటే కూర్చోని ప‌రిష్క‌రించుకోవాలి. ఇంట‌ర్నెట్‌లో నెగ‌టివ్ రివ్యూస్ రాయ‌డం వ‌ల్ల ఒన‌గూడే ప్ర‌యోజ‌న‌మేం ఉండ‌దు. ఇలాగే ఓ క‌మ్యూనిటీలో స‌మ‌స్య‌ల గురించి కొంద‌రు వ్య‌క్తులు గూగుల్‌లో రివ్యూస్ రాస్తే.. దానికి డిమాండ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. త‌ప్పుడు ప్ర‌చారం చేసిన‌వారు అందులో నుంచి బ‌య‌టికి వెళ్లిపోగా.. అధిక శాతం మంది నేటికీ అందులోనే నివ‌సిస్తున్నారు. కాక‌పోతే, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుని.. మ‌ళ్లీ మంచి క‌మ్యూనిటీగా నిల‌బ‌డ‌టానికి ప‌దేళ్లు ప‌ట్టింది. కాబ‌ట్టి, కొనుగోలుదారులు ఆవేశంగా గూగుల్‌లో రివ్యూస్ రాసి, వాట్స‌ప్‌లో చెత్త ప్ర‌చారం చేస్తే.. ఆయా క‌మ్యూనిటీ ఇమేజ్ మీద దెబ్బ ప‌డుతుంద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.
వీలైనంత వ‌ర‌కూ బిల్డ‌ర్‌తో కూర్చోని స‌మ‌స్య ప‌రిష్కారంపై దృష్టి సారించాలి. పేరున్న బిల్డ‌ర్లు ఎప్పుడైనా బ్రాండ్ ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నిస్తారు. కాబ‌ట్టి, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తారు.
బిల్డ‌ర్‌కు వ్య‌తిరేకంగా ఫ్లెక్సీలు పెడితే.. మ‌హా అయితే డెవ‌ల‌ప‌ర్‌కు ఫ్లాట్లు అమ్ముడుపోవ‌డం కాస్త క‌ష్ట‌మ‌వుతుంది. దాని వ‌ల్ల అత‌నికి తాత్కాలికంగా కొంత ఇబ్బంది క‌ల‌గొచ్చు. నిర్మాణ ప్ర‌గ‌తిని చూస్తే కొనుగోలు చేసే క‌స్ట‌మ‌ర్లు ఉంటారనే విష‌యం మ‌ర్చిపోవ‌ద్దు. కాబ‌ట్టి, వీలైనంత వ‌ర‌కూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ఉత్త‌మం.

This website uses cookies.