కొత్త అపార్టుమెంట్ ఆరంభమైతే చాలు.. గుంపులుగా జనాలొచ్చేస్తారు. అందులో రాజకీయ నాయకులు, స్థానిక గల్లీ లీడర్లు, మున్సిపల్, పంచాయతీ సభ్యుల్లో ఎవరో కొందరుంటారు. నయానో భయానో బిల్డర్లను బెదిరించి సొమ్ము లాగే ప్రయత్నం చేస్తారు.
ఫ్లాట్లు కొనేందుకు కుటుంబంతో సహా కొనుగోలుదారులు విచ్చేస్తే.. వారిని మార్కెటింగ్ సిబ్బంది ఎంతో వినయంగా ఆఫీసులోకి ఆహ్వానించి.. వారు అడిగే సందేహాలన్నీ నివృత్తి చేసి ఫ్లాట్లను విక్రయించడం మీద దృష్టి పెడతారు.
నిర్మాణ సంస్థకు చెందిన సీఆర్ఎం వద్దకొచ్చేసరికి.. సీన్ పూర్తిగా మారిపోతుంది.. ఫ్లాట్లు కొన్నవారికి సీఆర్ఎం సిబ్బంది ఫోన్ చేసి సొమ్ము కట్టాలని చెబుతుంటారు. టైమ్ ప్రకారం సొమ్ము కట్టాలని సంస్థ పదే పదే గుర్తు చేస్తుంటుంది.
నిర్మాణం చివరి దశకు వచ్చేసరికి.. బయ్యర్లు ఫోన్ చేస్తుంటే.. మార్పుల కోసం విసిగిస్తున్నారని సివిల్ ఇంజినీరు పెద్దగా పట్టించుకోడు.. నేరుగా కలవడానికి ప్రయత్నిస్తే.. పిల్లర్ల వెనక దాక్కునే ఇంజినీర్లూ ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఏ నిర్మాణం వద్ద అయినా తరుచుగా కనిపించే సన్నివేశాలివి. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నిర్మాణ రంగం బయటకొస్తే.. మూడు పూవులు ఆరు కాయలుగా ఈ రంగం విరాజిల్లుతుంది. నాలుగైదేళ్లు అక్కరకొచ్చే కారు తయారీ కోసం ఎంతో పరిశోధన చేసి.. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేవని నిర్థారించుకున్నాకే కార్లను విడుదల చేస్తారు. మరి, వందేళ్ల పాటు మన్నికగా నిలవాల్సిన ఇళ్ల నిర్మాణంలో మరెంత జాగ్రత్తలు తీసుకోవాలి? అందుకే, మిస్టేక్ ప్రూఫ్ ఇండస్ట్రీగా నిర్మాణ రంగాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మొదలైంది.
ఇప్పటికే ప్రభుత్వంతో, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి పని చేస్తున్న క్రెడాయ్ సంఘం.. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల్ని అనుసరిస్తూ సక్రమ పద్ధతిలో నిర్మాణాల్ని చేపట్టేలా రియల్టర్లు, తోటి బిల్డర్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భావించింది. అంతిమంగా కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. వారికి సకాలంలో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల్ని అందాలని క్రెడాయ్ అనుకుంటోంది. ఈ క్రమంలో భాగంగా క్రెడాయ్ తెలంగాణ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) అనే పుస్తకాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని క్రెడాయ్ తెలంగాణ ఏర్పాటు చేసింది.
ఒక అపార్టుమెంట్ కట్టేందుకు ఏయే అంశాలపై డెవలపర్లు దృష్టి సారించాలి? భూమి కొన్నప్పట్నుంచి ప్రాజెక్టును కొనుగోలుదారులకు అప్పగించేంత వరకూ ఏయే పనుల్ని.. ఎప్పుడెప్పుడు చేపట్టాలనే అంశాలపై ఈ పుస్తకంలో పొందుపరుస్తారు. బిల్డర్లు ఎన్ని అగ్రిమెంట్లు చేయాలి? ఎవరితో చేయాలి? అందుకు సంబంధించిన ఫార్మాట్లు ఏమిటి? భూసర్వే ఎలా చేయాలి? అందులో ఏయే అంశాల్ని పరిశీలించాలి వంటివి వివరిస్తారు. డెవలపర్ల సమయం వృథా కానీయకుండా ప్రత్యేకంగా ఒక చెక్ లిస్టును రూపొందిస్తారు. ఏయే పనుల్ని ఎప్పుడెప్పుడు చేయాలనే అంశంపై ఫ్లో ఛార్ట్ ఏర్పాటు చేస్తారు. పరిశ్రమ ఉత్తమ ప్రమాణాల్ని వివరిస్తారు. ఏయే నిర్మాణ సామగ్రిని వాడాలి? ఎంత నిష్పత్తిలో ఉపయోగించాలి? నిర్మాణాల్ని చేపట్టేటప్పుడు ఏయే దశలో ఏయే అంశాల్ని పరిశీలించాలి? వంటివి పొందుపరుస్తారు.
జేబు శాటిస్ ఫ్యాక్షన్ కోసం పని చేసే సిబ్బందిని జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్ దిశగా ఎలా మళ్లించాలన్నదీ ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం. వారికి ఎలాంటి శిక్షణను అందించాలి? ఇందులో ఎన్ఏసీతో ఒప్పందం కుదుర్చుకోవాలా? ఇతర జిల్లాల్లో ఇంజినీరింగ్ కళాశాలతో ఒప్పందం కుదర్చుకోవడం.. ఆన్ సైట్ శిక్షణ అందించడం వంటి వాటి గురించి పేర్కొంటారు. బిల్డర్లు దృష్టి సారించని ఏరియాలు ఏమేం ఉంటాయి? వందల ఫ్లాట్లు కడుతున్నప్పుడు కొన్ని వేల గదుల్ని నిర్మించాల్సి వచ్చినప్పుడు కింది స్థాయి సిబ్బంది మనస్తత్వం, వారి పని సామర్థ్యం మీదే ఫ్లాట్లను కట్టాల్సి ఉంటుంది. ఇలాంటి వారందరికి సరైన మార్గదర్శకం చేయాలన్నదే ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో ప్రతిఏటా కొత్త అంశాల్ని పొందుపరుస్తారు. జీవోలకు స్థానం కల్పిస్తారు. పన్నులు, జీఎస్టీకి సంబంధించిన ప్రతి అంశం కూడా వివరిస్తారు.
-కింగ్ జాన్సన్ కొయ్యడ
This website uses cookies.