- సుప్రీంకు విన్నవించిన
కేంద్ర ప్రభుత్వం..
దేశంలోని పలు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ డెవలపర్ల దోపిడీ పద్ధతుల నుంచి గృహ కొనుగోలుదారులను రక్షించేలా దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం స్పందించింది. దేశవ్యాప్తంగా ఏకరూపతను నిర్ధారించడానికి మోడల్ బిల్డర్-కొనుగోలు మరియు ఏజెంట్-కొనుగోలు ఒప్పందాలను రూపొందించడానికి కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని పిటిషన్ కోరింది. అంశం గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన డీవై చంద్రచూడ్, హిమకొహ్లీ ధర్మాసనం ముందుకొచ్చింది. దీనిపై కేంద్రం స్పందిస్తూ.. కొనుగోలుదారుల్ని పరిరక్షించేందుకు దేశమంతటా ఒకే రకమైన బిల్డర్, బయ్యర్ అగ్రిమెంట్‌ను రూపొందిస్తామని సుప్రీం కోర్టుకు తెలియజేసింది.
రెరాలోని ముఖ్యమైన నిబంధనలకు అనుగుణంగా ఈ ఒప్పంద పత్రాన్ని రూపొందిస్తామని విన్నవించింది.
అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, అమికస్ క్యూరీ న్యాయవాది దేవాశీష్ బారుకలు సూచించిన రోడ్డు మ్యాపును సుప్రీం కోర్టు నమోదు చేసింది. దీని ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం, అమికస్ క్యూరీతో కలిసి ఇళ్ల విక్రయాలకు సంబంధించి ఒక నమూనా ఒప్పందాన్ని సిద్ధం చేస్తుంది – పార్ట్ A: రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టం 2016 యొక్క తప్పనిసరి నిబంధనలకు అనుగుణంగా ‘కోర్’ నిబంధనలను కలిగి ఉంటుంది. ఇళ్ల కొనుగోలుదారుల రక్షణ కోసం రూపొందించిన ఈ నిబంధనలను ఏ రాష్ట్రం కానీ యూటీలు కానీ మార్చలేవు. పైగా, తప్పనిసరిగా అమ్మకానికి సంబంధించిన ప్రతి ఒప్పందంలో తప్పనిసరిగా భాగం అయి ఉండాలని సుప్రీం వివరించింది.