దేశంలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ అలాగే కొనసాగుతోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.4 కోట్లకు పైగా ధర కలిగిన ఇళ్లు 12,630 అమ్ముడుకావడం ఇందుకు నిదర్శనం. గతేడాది ఇదే కాలంలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే.. 38 శాతం ఎక్కువ. గతేడాది ఇదే త్రైమాసికంలో 9,165 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ తన తాజా నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్‌లో మాత్రం రూ.4కోట్లపైన ఖరీదైన ఇళ్ల విక్రయాలు 1,540 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో 1,560 యూనిట్లు అమ్ముడయ్యాయి. నగరాల వారీగా చూస్తే.. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అత్యధికంగా 5,855 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
క్రితం ఏడాది విక్రయాలు 3,410 యూనిట్లతో పోల్చితే 70 శాతం పెరిగాయి. ముంబైలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 3,250 యూనిట్ల నుంచి 3,820 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 240 యూనిట్ల నుంచి 35 యూనిట్లకు తగ్గిపోయాయి. పుణెలో భారీగా పెరిగి 810 యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 330 యూనిట్లుగానే ఉన్నాయి. చెన్నైలోనూ 130 యూనిట్ల నుంచి 185 యూనిట్లకు అమ్మకాలు వృద్ధి చెందాయి. కోల్‌కతాలో రూ.4కోట్లకు పైన విలువ చేసే 380 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.
క్రితం ఏడాది ఇదే కాంలో 240 యూనిట్లు అమ్ముడయ్యాయి. సంప్రదాయంగా మధ్యస్థ బడ్జెట్ ఇళ్ల మార్కెట్లు అయిన నోయిడా, బెంగళూరు, పుణె, చెన్నైలోనూ క్రమంగా లగ్జరీ ఇళ్ల వైపునకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నారని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈఓ అన్షుమన్ మ్యాగజీన్ పేర్కొన్నారు. బంగళాల నుంచి ఆధునిక అపార్ట్ మెంట్లు, పెంట్‌హౌస్‌ల వైపు మళ్లుతున్నారని, దీంతో లగ్జరీ ప్రాజెక్టుల్లో ప్రీమియం సౌకర్యాల కల్పన ఇతర ప్రాజెక్టులతో పోల్చితే కీలక మారిందని వ్యాఖ్యానించారు. ఆదాయం పెరగడం, సులభతర రుణ సదుపాయాలు, ఆధునిక, సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లు అటు నివాసానికి, ఇటు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
This website uses cookies.