poulomi avante poulomi avante

ఎలివేటర్ల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ కావాలి

హైదరాబాద్ లో ఇటీవల వరుసగా లిఫ్ట్‌కు సంబందించిన ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నా మధ్య లిఫ్టుకు, అపార్ట్‌మెంట్ గోడకు మధ్య చిక్కుకుని ఆరేళ్ల బాలుడి మరణించాడు. తాజాగా సిరిసిల్లలో కమాండెంట్ గంగారాం లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందాడు. తరచూ జరుగుతున్న ఈ ప్రమాదాలు ఎలివేటర్ల నిర్వహణ లోపాలకు నిదర్శణమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ తో పాటు నగరాలు, పట్టణాల్లో అపార్ట్‌ మెంట్లు, స్కై స్క్రాపర్స్ సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్ట్ ల ఏర్పాటు తప్పనిసరి అయ్యింది. ఐతే నాణ్యత, నిర్వహణ లోపాలతో తరుచూ ఎలివేటర్లు ఇలాంటి ప్రమాదాలకు కేంద్రబిందువులుగా మారుతున్నాయి. డోర్స్ పూర్తిగా మూసి ఉండే లిఫ్ట్ లు ఉన్నచోట కరెంటు సరఫరా నిలిచిపోయి లేదా సాంకేతిక సమస్యలతో అది మధ్యలో ఆగిపోతే అందులో చిక్కుకున్నవారికి ఊపిరి ఆడక అల్లాడుతున్నారు. లిఫ్ట్ లో చిక్కుకుంటే ఎమర్జెన్సీ ఫోన్ చేయడానికి చాలా అపార్టుమెంట్లలో ఏర్పాట్లు లేవు.

లిఫ్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వ పరంగా చట్టాలేవీ లేవని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎలివేచర్లకు సంబందించి ఇంధనశాఖ ముసాయిదా చట్టం రూపొందించింది. ఐతే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించకపోవడంతో అది చట్ట రూపం దాల్చలేదు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లు రూపొందించారు. అయినప్పటికీ అది కూడా చట్టంగా మారలేదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హరియాణా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎలివేటర్ల ఏర్పాటు, నిర్వహణకు ప్రత్యేక చట్టాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గత నెల 9వ తేదీనే అసెంబ్లీలో ఈ చట్టాన్ని ఆమోదించారు.

తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్క్ లేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 10 వేల వరకు ఎలివేటర్లను విక్రయిస్తున్నారు. వీటిల్లో 20 శాతమే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల మేరకు నాణ్యమైనవి ఉంటున్నట్లు అంచనా వేస్తున్నారు. మిగిలినవి ఏ మాత్రం అనుభవం లేని సంస్థలు, నైపుణ్యం లేని తయారీదారులు విక్రయిస్తున్న లిఫ్టులు కావడమే ప్రమాదాలకు కారణమని చెబుతున్నారు. కొందరు బిల్డర్ల తక్కువ ధరలకు కాంట్రాక్టులు తీసుకుని ఏ మాత్రం నాణ్యత లేని ఎలివేటర్లను అమరుస్తున్నారు. దీనికి తోడు అపార్ట్‌మెంట్‌ రెసిడెన్షియల్ అసోషియేషన్ లు నెలవారీ నిర్వహణను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు తెలిపారు.

నివాస, వాణిజ్య భవనాల్లో ఎలివేటర్ ఏర్పాటు చేశాక విద్యుత్తు శాఖ ఎన్ ఓసీ జారీ చేయాల్సి ఉన్నా అందుకు సంబంధించిన చట్టం లేకపోవడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో విద్యుత్ సిబ్బంది కొందరు లిఫ్ట్ లకు ఎంత లోడు కరెంటు కనెక్షన్‌ ఇస్తున్నారనేది కూడా తనిఖీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి లిఫ్ట్ ఏర్పాటుకు బీఐఎస్ నిబంధనలు పాటించాలని నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు చెబుతున్నాయి. బీఐఎస్ నిబంధన 7175 ప్రకారం ప్రతి లిఫ్ట్ ను నిర్మించే సమయంలో దానిలో ఎంత మంది ప్రయాణించగలరు, ఆ ఎలివేటర్ ఎంత బరువు మోయగలదు వంటి ప్రమాణాల మేరకు కరెంటు సరఫరా, సామగ్రి వినియోగంలో నిబంధనలు పాటించడంలేదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా 20 ఏళ్లకు మించిన ఎలివేటర్ల స్థానంలో అవసరమైతే కొత్తవి బిగించాలి. కానీ పాత లిఫ్టులలో అధునాతన భద్రత ప్రమాణాలు లేకున్నా ఏళ్ల కొద్ది వాటినే వినియోగిస్తున్నారు.

ప్రతి సంవత్సరం ఎలివేటర్లను సాంకేతిక నిపుణులతో భద్రత ఆడిట్ లు నిర్వహించాలి. అవసరానికి తగినట్లుగా లిఫ్ట్ కు సంబందించిన సామగ్రిని మార్చాలి. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఆటోమేటిక్ డోర్ సెన్సర్లు, ఓవర్ లోడ్ వార్నింగ్, అగ్నినిరోధక పదార్థాలు, అత్యవసర బ్రేకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలివేటర్ క్యాబిన్ లు, షాఫ్ట్ లను నిర్మించడానికి మన్నికైన, ఫైర్ రెసిస్ట్ సామగ్రిని వినియోగించాలి. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫైడ్ నిపుణులతోనే ఎలివేటర్ లను ఇన్ స్టాల్ చేయించుకోవాలి. నిర్వహణ సరిగానే ఉందని నిర్ధారించుకునేందుకు నిపుణులతో ప్రతి యేడాది సర్వీసింగ్ చేయించాలి. లిఫ్ట్ గరిష్ఠ లోడ్ సామర్థ్యాన్ని మించకుండా ప్రయాణికులు జాగ్రత్తపడాలి. పిల్లలు లిఫ్ట్ లోకి ఒంటరిగా వెళ్లకుండా చూసుకోవాలి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles