తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం నేల చూపులుచూస్తోంది. 2023 వరకు జోరిగా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం మెల్ల మెల్లగా చతికిలపడుతూ వస్తోంది. హైదరాబాద్ లో నిర్మాణరంగంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రియాల్టీ బిజినెస్ నెమ్మదిస్తూ వస్తోంది. గ్రేటర్ సిటీలో ఇళ్ల అమ్మకాలు తగ్గగా.. జిల్లాల్లో భూముల ధరలు పడిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఐతే తెలంగాణలో అడ్డూ అదుపు లేకుండా పెరిగిన భూముల ధరలు కూడా ఇందుకు కారణమని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణలో 2004 నుంచి 2023 వరకు రియల్ ఎస్టేట్ రంగం జోరుగా సాగింది. ఇటు హైదరాబాద్ లో నిర్మాణరంగం ఆకాశమే హద్దుగా దూసుకుపోగా.. అటు జిల్లాల్లో భూములు, వెంచర్ల బిజినెస్ భారీగా సాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గ్రేటర్ సిటీలో నిర్మాణరంగం నెమ్మదించగా.. జిల్లాల్లో భూములు, ప్లాట్ల అమ్మకాలు పడిపోయాయి. అంతటితో ఆగకుంగా ధరలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అమ్మడానికి భూములు, ప్లాట్లు రెడీగా ఉన్నా పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరీ ముఖ్యంగా పదేళ్ల గరిష్ట స్థాయికి భూముల ధరలు పెరగడమే ఇందుకు కారణమని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ పరిసర జిల్లాల్లో మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరిగా సాగింది. ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఇటు జాతీయ రహదారి 44ను ఆనుకొని కొత్తూరు, షాద్నగర్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, పాలమూరు, భూత్పూర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. అటు సంగారెడ్డి, సదాశివపేట్, జహీరాబాద్ వరకు భూముల లావాదేవీలు జోరిగా జరిగాయి. ఘట్ కేసర్, భునగిరి నుంచి మొదలు యాదగిరి గుట్ట వరకు వెంచర్ల హవా కొనసాగింది. ప్రధాన రహదారికి ప్రాంతాన్ని బట్టి ఎకరం భూమి 3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు, గజం భూమి ప్రాంతం, ప్రాజెక్టుని బట్టి 30 వేల నుంచి 80 వేల వరకు ధరలు పలికాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎకరం భూమి 30 లక్షల నుంచి 80 లక్షల వరకు, ఇంటి స్థలం గజం 15 వేల నుంచి 30 వేల వరకు వెళ్లాయి. అయితే ఈ రేట్లు పదేండ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం సమస్యగా మారిందని చెబుతున్నారు.
2014 లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో చాలా మంది రియాల్టీ బిజినెస్ లో దిగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగిన వారు ఇష్టారితీన భూముల ధరలు పెంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 8 లక్షల నుంచి 10 లక్షల లోపు ఉన్న ఎకరం భూమిని ఏకంగా 20 లక్షల నుంచి 30 లక్షలకు పెంచి.. హైదరాబాద్ కు చెందిన పెట్టుబడిదారులతో ఈ భూములను కొనుగోలు చేయించారు. అలాగే వివాహాలు, ఇతర అవసరాల కోసం మధ్య తరగతి కుటుంబాలు పెద్ద ఎత్తున వెంచర్లలోని ప్లాట్లను కొనుగోలు చేసి పెట్టుకున్నాయి. భూములు, ప్లాట్ల ధరలు ఓ స్థాయికి చేరిపోయాయి. నిజం చెప్పాలంటే మార్కెట్ స్థాయికి మించి ధరలు పెరిగాయని చెప్పకతప్పదు. కానీ 2023 నుంచి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. క్రమంగా రియల్ ఎస్టేట్ రంగం జోరు తగ్గుతూ వస్తోంది. భూములు, ప్లాట్ల అమ్మకాలు తగ్గడంతో పాటు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో రియాల్టీ రంగంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
ఎవరికైనా అత్యవసరం ఉండి భూములు, ప్లాట్లు అమ్ముదామన్నా ప్రస్తుతం ఉన్న ధరలకు ఎవరూ కొనడం లేదు. తక్కువ ధరకు అమ్ముదామన్నా.. వీటి మీద పెట్టిన పెట్టుబడులకు ఇంట్రస్ట్ కూడా రాకపోవడంతో సైలెంట్ గా ఉంటున్నారు. కొందరు వ్యాపారులు పెట్టిన పెట్టుబడికన్నా ఎక్కువగా వడ్డీ మీద పడుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తక్కువ ధరకే ప్లాట్లు, భూములు అమ్మేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా భూములు, ప్లాట్ల ధరలు దిగొస్తున్నాయి. ఎక్కడికక్కడ వ్యాపారం నిలిచిపోవడంతో ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల వ్యాపారులు గజం విలువ ధరలను తగ్గించి అమ్ముతున్నారు. హైదరాబాద్ పరిసర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు సైతం 20 నుంచి 30 శాతం మేర తగ్గించి అమ్ముకుంటున్నారు. అయినప్పటికీ కొనుగోలు చేసేవారు పెద్దగా ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరి ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుంది? మళ్లీ ఎప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కోలుకుంటుంది? అన్న సందేహాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని పట్టిపీడిస్తున్నాయి.