-
రూ.13వేల కోట్ల డీల్.. చివరి దశలో చర్చలు
ప్రముఖ రియల్టీ సంస్థ ఎమార్ ఇండియాను బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నట్టు సమాచారం. డీల్ విలువ రూ.13వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. దుబాయ్ కు చెందిన ఎమార్ ప్రాపర్టీస్ 2005లో ఎంజీఎఫ్ డెవలప్‌మెంట్‌తో భాగస్వామ్యం ద్వారా భారత రియల్టీ మార్కెట్లో ప్రవేశించింది. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ(జేవీ) ఎమార్ ఎంజీఎఫ్ ద్వారా ఢిల్లీ, ముంబై, మొహాలీ, లక్నో, ఇండోర్, జైపూర్‌లలో రెసిడెన్షియల్, కమర్షియల్ విభాగాలలో దాదాపు రూ. 8,500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. 2016 ఏప్రిల్‌లో జేవీకి ముగింపు పలికేందుకు ఎమార్ ప్రాపర్టీస్ నిర్ణయించుకుంది.
ఎమార్ ఇండియాలో వాటా విక్రయానికి దేశీయంగా అదానీ సహా వివిధ గ్రూప్‌లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు ఎమార్ ప్రాపర్టీస్ ఈ ఏడాది జనవరిలోనే వెల్లడించింది. అయితే విలువ, లావాదేవీపై ఎలాంటి నిర్ణయానికీ రాలేదని స్పష్టం చేసింది. కాగా.. అన్‌లిస్టెడ్ సంస్థలు అదానీ రియల్టీ, అదానీ ప్రాపర్టీస్ ద్వారా అదానీ గ్రూప్ దేశీ రియల్టీ మార్కెట్లో వేగవంతంగా విస్తరిస్తోంది. అదానీ రియల్టీ దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది.