- ప్రీఈఎంఐ ఒప్పందంలో వాయిదాల ఆలస్యానికి బయ్యర్ బాధ్యత లేదు
- ప్రీ ఈఎంఐతో పాటు రూ. లక్ష చెల్లించాలి
- ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశం
2011లో కొనుగోలు చేసిన ఫ్లాట్ నిర్మాణాన్ని పూర్తి చేసి.. నేటివరకూ అప్పగించకపోవడంతో పాటు.. 2019 నుంచి కోర్టుల చుట్టూ తిప్పుతూ.. కొనుగోలుదారుడి మానసిక వేదనకు కారణమైన బిల్డర్ అనైతిక చర్యలకు.. పరిహారం చెల్లించాలంటూ ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌కు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తేల్చి చెప్పింది. ఫ్లాటుకు 80 శాతం రుణం పొందినప్పుడు బ్యాంకుతో పాటు కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందంలో సొమ్ము విడుదలలో జాప్యానికి కొనుగోలుదారుడి బాధ్యత లేదని స్పష్టం చేసింది. నిర్మాణంలో పురోగతిని చూపి బ్యాంకు నుంచి బిల్డర్ నేరుగా సొమ్ము పొందాల్సి ఉండగా.. కొనుగోలుదారుడిని బాధ్యుడ్ని చేయడం సరికాదని అభిప్రాయపడింది. అంతేకాకుండా ఒప్పందం ప్రకారం పనులు పూర్తి చేయకుండా ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోవాలని చెప్పడం సరికాదని.. అలాంటప్పుడు పనులన్నీ పూర్తి చేసినట్లు నిరూపించుకోవాల్సిన బాధ్యత బిల్డరుపైనే ఉందని తెలియజేసింది.
హఫీజ్‌పేట్‌లో ఆదిత్యా కన్‌స్ట్రక్షన్స్ ఆదిత్య ఇంపీరియల్ హైట్స్ రిచ్‌మండ్‌లో హైదరాబాద్‌కు చెందిన రాహుల్ పండిట్ రూ.54.50 లక్షలకు ఫ్లాట్ కొనుగోలు చేశారు. 2011లో అడ్వాన్సుతో సహా రూ.8.17 లక్షలు చెల్లించి.. రూ.43.60 లక్షలు రుణం తీసుకుని త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. నిర్మాణం పూర్తయ్యే దాకా ప్రీ ఈఎంఐ చెల్లించడానికి బిల్డర్ అంగీకరించాడు. అయితే 2016 నుంచి ఈఎంఐ నిలిపివేయడంతో పాటు రూ.5.76 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసు పంపాడు.
పనులు అసంపూర్తిగా ఉండటంతో పాటు ఈఎంఐ చెల్లించాలంటూ మెయిల్, నోటీసు ఇచ్చినా సమాధానం లేకపోవడంతో కొనుగోలుదారుడు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన సభ్యులు కె. రంగారావు, ఆర్ఎస్ రాజెశ్రీలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పును వెలువరించింది. ఆదిత్య కన్‌స్ట్రక్షన్ వివరణ ఇస్తూ ప్రీ-ఈఎంఐ ఒప్పందం ప్రకారం పది రోజుల్లో చెల్లించాల్సి ఉండగా రూ.లక్ష మాత్రమే చెల్లించి మిగితా అరవై రోజుల్లో చెల్లించారని తెలిపింది.
అంతేకాకుండా కొనుగోలుదారుడు కొన్ని వాయిదాలు చెల్లించకపోవడంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని, ఫ్లాట్ పనులు పూర్తయ్యి.. ఇంటీరియర్స్ నిమిత్తం స్వాధీనం చేసినా ఆ విషయాన్ని వెల్లడించలేదని తెలియజేసింది. ఇరుపక్షాల వాదనల్ని విన్న ధర్మాసనం త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు వాయిదాల చెల్లింపులో బయ్యర్‌కు జవాబుదారీతనం లేదని, బ్యాంకు నుంచి నిర్మాణ పురోగతిని చూసి బిల్డరే సొమ్ము తీసుకోవాల్సిన ఉందని తెలిపింది. బయ్యర్ సమర్పించిన ఆధారాల ప్రకారం నిర్మాణ పనులు పూర్తి చేయలేదని, చేసినట్లయితే దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత బిల్డరుపైనే ఉందని అభిప్రాయపడింది.
ఫ్లాట్ అప్పగించినప్పుడు బయ్యర్ కేవలం రూ.2.52 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. రూ.5.76 లక్షలు చెల్లించాలనడం కరెక్టు కాదని తెలిపింది. బిల్డర్ అనైతిక చర్యల వల్ల 2011 నుంచి ఇప్పటివరకూ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ లేకుండా.. 2019 నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నందుకు కొనుగోలుదారుడు పరిహారానికి అర్హుడేనని చెప్పింది. ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో పాటు 2016 నుంచి ప్రీఈఎంఐ, పరిహారంగా రూ.లక్ష, ఖర్చుల కింద మరో రూ.20 వేలు చెల్లించాలంటూ ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌ను ఆదేశించింది.