దేశంలో అందుబాటు ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడనుందని.. 2030 నాటికి ఈ విభాగం పరిమాణం రూ.67 లక్షల కోట్లకు చేరుకుంటుందని సీఐఐ-నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. అదే సమయానికి ఏకంగా 3.12 కోట్ల ఇళ్ల కొరత ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే ఈ విభాగంలో కోటి ఇళ్లకు పైగా కొరత ఉందనే విషయాన్ని ప్రస్తావించింది. పట్టణీకరణ, ఉపాధి అవకాశాల వంటి అంశాలను బట్టి భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో 22.2 మిలియన్ గృహాలు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందులో 95.2 శాతం.. అంటే 21.1 మిలియన్ యూనిట్లు అందుబాటు ధరల ఇళ్ల విభాగానికి చెందినవే.
అలాగే ఈ డిమాండ్ లో 45.8 శాతం ప్రధాన వాటా ఈడబ్ల్యూఎస్ కుటుంబాల మధ్యే కేంద్రీకృతమై ఉంటుంది. ఇప్పటికే ఈ విభాగంలో 10.1 మిలియన్ యూనిట్ల కొరత ఉందని.. 2030 నాటికి ఈ డిమాండ్ 31.2 మిలియన్ యూనిట్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. 3.12 కోట్ల అందుబాటు ధరల ఇళ్లను నిర్మించేందుకు 1.9 లక్షల ఎకరాల భూమి అవసరమని అంచనా వేసింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని నిర్మించడం ద్వారా డిమాండ్‌ను చేరుకోవచ్చని సూచించింది.
అదనపు ఫ్రీ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తోపాటు, డెవలపర్లకు పన్నుల రాయితీలను కల్పించాలని కోరింది. మరోవైపు దేశంలో అందుబాటు ధరల ఇళ్ల రుణ మార్కెట్ ప్రస్తుత ఫోర్ట్ ఫోలియో రూ.13 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేటగిరీలోని లోన్ మార్కెట్ గణనీయమైన విస్తరణ జరుగుతుందని పేర్కొంది. 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా మించకుండా, రూ.45 లక్షలు మించని ఇళ్లు అందుబాటు ధరల విభాగంలోకి వస్తాయి.
2011 నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో అందుబాటు ధరల ఇళ్ల విభాగం 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు నివేదిక తెలిపింది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కు వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఇది 9.8 శాతం కాగా, మొత్తం రియల్ ఎస్టేట్ రంగ ఇన్ ఫ్లోలో 3.6 శాతం మాత్రమే. 2019 కరోనా ముందు కాలంతో పోలిస్తే అందుబాటు ఇళ్ల విభాగంలో యూనిట్ల సగటు ధర గణనీయంగా పెరిగింది. ఇది ఇళ్ల కొనుగోలుదారులకు.. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నవారి స్తోమతపై కీలక ప్రభావం చూపుతోంది.
ముంబైలో అందుబాటు ఇళ్ల యూనిట్ సగటు ధర అప్పుడు రూ.48 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.73 లక్షలకు పెరిగింది. అలాగే చిన్న యూనిట్లు పెద్ద యూనిట్ల కంటే ఎక్కువ ధర పెరిగాయి. ముంబైలో 30 చదరపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన రెసిడెన్షియల్ యూనిట్ సగటు ధర 2019తో పోలిస్తే 55 శాతం పెరగ్గా.. 60 చదరపు మీటర్ల వైశాలన్యం కలిగిన ఇంటి సగటు ధర 29 శాతం పెరిగింది.
అందుబాటు ఇళ్ల కోసం పెరుగుతున్న డిమాండ్ డెవలపర్ మరింత చొరవ చూపించే పరిస్థితి తీసుకొచ్చింది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా భూమి ఖర్చులు, నిర్మాణ వ్యయాలు, సంస్థాగత పెట్టుబడుల కొరత మొదలైన కారణాల వల్ల ఈ ప్రాజెక్టుల లాభదాయకత తక్కువగా ఉంటుండటంతో అందుబాటు గృహాల ప్రాజెక్టుల్లో ప్రైవేట్ డెవలపర్ల భాగస్వామ్యం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ప్రైవేట్ డెవలపర్‌ల భాగస్వామ్యాన్ని ఆకర్షించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. అవేంటంటే..
ఖాళీగా ఉన్న/ఉపయోగించని పీఎస్‌యూ భూములను ఇవ్వడం వల్ల డెవలపర్లకు ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా గృహ యూనిట్ల విక్రయ ధర కూడా తగ్గుతుంది. నైట్ ఫ్రాంక్ అంచనాల ప్రకారం, 31.2 మిలియన్ల ఇళ్ల నిర్మాణానికి 1.9 లక్షల ఎకరాల భూమి అవసరం.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. భారతీయ నగరాల్లో ఎఫ్ఎస్ఐ/ఎఫ్ఏఆర్ పరిమితులు చాలా తక్కువగా ఉంటాయి. భారతదేశంలోని నగరాలపై జనాభా ఒత్తిడి పెరుగుతూనే ఉన్నందున ఈ తక్కువ పరిమితులు ధరల పెరుగుదలకు దారితీస్తాయి. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన కుటుంబాల గృహ కొనుగోలు సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. అలాగే అందుబాటు గృహ ప్రాజెక్ట్ ఆర్థిక వ్యయాన్ని కూడా పెంచుతుంది.
ఈ నేపథ్యంలో అందుబాటు గృహాల అభివృద్ధి కోసం ఉచిత/బేస్ ఎఫ్‌ఎస్‌ఐని పెంచడం వల్ల ఇంటి నిర్మాణ వ్యయాన్ని సమర్థవంతంగా తగ్గించవచ్చు. నైట్ ఫ్రాంక్ అసెస్‌మెంట్ ప్రకారం, బేస్ లేదా ఉచిత ఎఫ్ఎస్ఐని 50% పెంచడం వల్ల సరఫరా 50% పెరుగుతుంది. నిర్మాణ వ్యయం 24% తగ్గుతుంది.
ప్రస్తుతం, పన్ను ప్రోత్సాహకాలు డెవలపర్ లాభాలపై ఒక సంవత్సరం పాటు మొత్తం ఆదాయపు పన్ను మినహాయింపుకు పరిమితం చేశారు. అయితే, సరసమైన గృహ ప్రాజెక్టుల లాభదాయకత సవాలుగా ఉన్నందున, డెవలపర్ భాగస్వామ్యంపై పరిమిత ప్రభావం ఉంటుంది. అందువల్ల, ప్రాజెక్ట్ ఆర్థిక సాధ్యాసాధ్యాలను మెరుగుపరచడానికి ప్రైవేట్ డెవలపర్‌లకు జీఎస్టీపై రాయితీలు, సబ్సిడీలు వంటి పన్ను ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉంది.
కాగా, అందుబాటు ధరల విభాగంలో ఇళ్ల కొరత రియల్ ఎస్టేట్ డెవలపర్లకు, ఆర్థిక సంస్థలకు అపారమైన అవకాశాలు కల్పిస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా పేర్కొన్నారు. అందుబాటు ధరలు, మధ్యాదాయ హౌసింగ్ విభాగాలకు సరైన మార్కెటింగ్ వ్యూహం అవసరమని హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ ఎండీ, సీఈవో విపుల్ రూంగ్తా అన్నారు. మధ్య, తక్కువ ఆదాయ ఇళ్ల విభాగంపై తాము దృష్టి సారించినట్టు చెప్పారు. ఢిల్లీ, ముంబై నగరాల్లో రూ.2 కోట్ల ధరల్లోపు ఇళ్లను మధ్యాదాయ, రూ.కోటి లోపు ఇళ్లను తక్కువ ఆదాయ విభాగంగా పరిగణిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ 3 లక్షల ఇళ్లకు రుణ సాయం అందించినట్టు రూంగ్తా చెప్పారు.
This website uses cookies.