తిరుపతిలో స్థలం.. రేపటికి ఆర్థిక బలం
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక విశ్వవిద్యాలయాలతో తిరుపతి ఒక విద్యా కేంద్రంగానూ నిలిచింది. శ్రీవారి అనుగ్రహంతో ఈ పట్టణం పచ్చదనం, కొత్త రహదారులతో సుందరంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ కొద్ది రోజులైనా నివాసం ఉండటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తి చూపుతుంటారు. దీంతో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో తిరుపతి ముందు వరుసలో నిలిచింది. మరి, తిరుపతిలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా? అక్కడ ధరలెలా ఉన్నాయంటే..
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు అమరావతి, విశాఖపట్నం పై ఎక్కువగా దృష్టి సారించినట్లు ప్రకటనలు వచ్చాయి. పలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా అక్కడే ఏర్పాటు అవుతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో తెరవెనుక తిరుపతి అభివృద్ధికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవి అన్నీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తిరుపతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోనుంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తో పోటీ పడుతున్న ఇళ్ల స్థలాలు మరింత ప్రియం కానున్నాయి.
తిరుపతిలో ప్రస్తుతం ఎయిర్ బైపాస్ రోడ్డులో అత్యధికంగా అంకణం (నాలుగు గజాలు) ధర రూ.10 లక్షల వరకు పలుకుతోంది. శివారు ప్రాంతాల్లోనూ తుడా అప్రూవల్ స్థలం అంకణం ధర రూ.లక్షకు పైమాటే. ఈ ధరల్లో కొనలేని వారు ఏర్పేడు, శ్రీకాళహస్తి వరకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. చెన్నై మార్గంలో పుత్తూరు వరకు వెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత మరో 10 శాతం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
రేణిగుంట – తిరుపతి మధ్య ఉన్న శెట్టిపల్లి లో ఆర్థిక మండలి ఏర్పాటుకు గతంలో తెదేపా ప్రభుత్వం 2014 -19 మధ్య కసరత్తు చేసింది. తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ అంశం మరుగున పడింది. ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇక్కడ తుడా ఆధ్వర్యంలో భూమిని అభివృద్ధి పరచి ఆర్థిక మండలి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తెరవెనుక పనులు చేస్తోంది. రైతులతో ఉన్నతాధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. ల్యాండ్ షేరింగ్ పద్ధతిలో ఇక్కడ పనులు చేపట్టనున్నారు. తర్వాత పెద్ద కంపెనీలకు ఇక్కడ భూములు ఇస్తారు.
విమానాశ్రయం సమీపంలో గతంలో కొన్ని ఎలక్ట్రానిక్ సంస్థలు ఏర్పాటు అయ్యాయి. అదనంగా మరికొన్ని కంపెనీలు తెచ్చేందుకు ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది.
ఏర్పేడు – వెంకటగిరి మార్గంలో కొన్ని భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కంపెనీల అధిపతులతో సంప్రదింపులు జరుపుతోంది. ఆ చర్చలు త్వరలో ఫలప్రదం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.
తిరుపతికి మణిహారంగా మరో భారీ ఫ్లైఓవర్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే గరుడ వారధి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కొత్తగా 200 అడుగుల బెంగళూరు బైపాస్ రోడ్డు మార్గంలో చంద్రగిరి వద్ద ఉన్న సి. మల్లవరం నుంచి రేణిగుంట సమీపంలోని తూకివాకం వరకు 17 కిలోమీటర్ల మేర ఆరు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ పనులు ప్రారంభించింది. నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముందుగా కింద సర్వీస్ రోడ్డు అభివృద్ధి పరచేందుకు మార్కింగ్ ఇచ్చారు. మట్టి నింపే పనులు అతి త్వరలో చేపట్టనున్నారు. తర్వాత పై వంతెన పనులు చేపడతారు. ఇది తిరుపతికి కొత్త శోభను తేనుంది. ఈ పనులన్నీ ఆచరణకు వస్తే తిరుపతి రూపురేఖలు మారిపోనున్నాయని భావిస్తున్నారు. ఏడాదిగా పెరుగుదల లేకుండా ఉన్న తిరుపతిలో ఇప్పుడు ఇల్లు, ఇళ్ల స్థలాలు కొన లేకపోతే రేపు మరింత ఎక్కువకు కొనాల్సి వస్తుందనేది రియల్టర్ల మాట.
This website uses cookies.