Categories: TOP STORIES

వెల్లువలా ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు

స్థిరాస్తిలోకి భారీగా వస్తున్న ఏఐఎఫ్ నిధులు

దేశ స్థిరాస్తి రంగంలోకి ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (ఏఐఎఫ్‌) వెల్లువెత్తుతున్నాయి. ఈ పెట్టుబడులు రూ.75వేల కోట్లకు చేరినట్టు రియల్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ తెలిపింది. ఏఐఎఫ్‌ మొత్తం పెట్టుబడుల్లో 17 శాతం రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకే వచ్చినట్టు వెల్లడించింది. గత పదేళ్లలో భారత్‌లో ఏఐఎఫ్‌లలో భారీ వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. మిగిలిన రంగాలతో పోల్చి చూసినప్పుడు ఏఐఎఫ్‌ పెట్టుబలు రియల్ రంగంలోకే ఎక్కువగా వస్తున్నాయని 2024-25 సెప్టెంబర్‌ త్రైమాసికం (క్యూ2) వరకు రూ.4,49,384 కోట్ల ఏఐఎఫ్‌ పెట్టుబడుల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి రూ.75,468 కోట్లు (17 శాతం) వచ్చినట్టు నివేదిక వెల్లడించింది.

స్థిరాస్తి రంగం తర్వాత ఐటీ/ఐటీఈఎస్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంక్‌లు, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ, ఇతర రంగాలు ఏఐఎఫ్‌లతో ప్రయోజనం పొందినట్టు తెలిపింది. 2024 మార్చి నాటికి ఏఐఎఫ్‌ ద్వారా రియల్‌ ఎ‍స్టేట్‌లోకి రూ.68,540 కోట్ల పెట్టుబడులు రాగా.. 2024-25 సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి అవి రూ.75,468 కోట్లకు పెరిగినట్టు అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌పురి వెల్లడించారు.

రియల్టీ తర్వాత ఐటీ/ఐటీఈఎస్‌ రంగంలోకి అత్యధికంగా రూ.27,815 కోట్లు ఏఐఎఫ్‌ల ద్వారా వచ్చాయి. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లోకి రూ.25,782 కోట్లు, ఎన్‌బీఎఫ్‌సీల్లోకి రూ.21,503 కోట్లు, బ్యాంకుల్లోకి రూ.18,242 కోట్లు, ఫార్మాలోకి రూ.17,272 కోట్లు, ఎఫ్‌ఎంసీజీలోకి రూ.11,680 కోట్లు, రిటైల్‌లోకి రూ.11,379 కోట్లు, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలోకి రూ.10,672 కోట్లు, ఇతర రంగాల్లోకి రూ.2,29,571 కోట్లు వచ్చాయని ఈ నివేదిక వెల్లడించింది.

గత ఐదేళ్ల కాలంలో మొత్తం ఏఐఎఫ్‌ పెట్టుబడుల్లో కేటగిరీ-2 నుంచే 80 శాతం మేర ఉన్నట్టు అనరాక్‌ నివేదిక తెలిపంది.

This website uses cookies.