ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత విశాఖలో రియల్ ఎస్టేట్ జోరందుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద ప్రాజెక్టులు వరుసగా రానుండటంతో రియల్ భూమ్ పెరుగుతుందని చెబుతున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో రియల్ పరుగులు పెట్టే అవకాశం ఉందంటున్నారు.
విశాఖపట్నం పోర్టుతో ఉండటంతోపాటు గంగవరం పోర్టు వస్తుండటం, విశాఖ, భీమునిపట్నం మధ్య బీచ్ కారిడార్, భోగాపురం, విశాఖ మధ్య ప్రతిపాదిత ఎక్స్ ప్రెస్ హైవే వంటి అంశాలు ఇందుకు దోహదం కానున్నాయి. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రియల్ వృద్ధి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల తర్వాత రియల్టీ రంగంలోని దిగ్గజాలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు. భారీగా ఎఫ్ డీఐలు కూడా విశాఖకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత రాజధాని విశాఖ ఉంటుందా లేక అమరావతి కొనసాగుతుందా అనే అంశంతో సంబంధం లేకుండానే విశాఖపట్నం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, తద్వారా రియల్ రంగం కూడా వృద్ధి చెందుతుందని విశ్లేషిస్తున్నారు.
‘భోగాపురంలో జీఎంఆర్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు, అదానీ డేటా పార్క్, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్-విశాఖ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే ఈస్ట్ కోస్ట్ ఎకనమిక్ కారిడార్ వంటి అంశాలు విశాఖలో రియల్ వృద్ధికి దోహదం చేస్తాయి. ఇక్కడ రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, ఆఫీస్ స్పేస్ మార్కెట్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది’ అని సీఐఐ జోనల్ చైర్మన్ రాజేశ్ గ్రంథి పేర్కొన్నారు. పెద్ద లాజిస్టిక్స్ ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా ప్రారంభమైతే విశాఖలో రియల్ భూమ్ ఖాయమని జేఎల్ఎల్ ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. ఐటీతోపాటు రక్షణ, ఫార్మా, సీ ఫుడ్ ఎగుమతులు, ఆహార శుద్ధి పరిశ్రమలు, పర్యాటకం, ఆతిథ్యం, మెడికల్ టూరిజం వంటి రంగాల్లో విశాఖ వృద్ధి చెందుతుందని అంచనా వేస్తునన్నారు.