గత కొంతకాలం నుంచి వాట్సప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఒక సంస్థ కొల్లూరులో పద్దెనిమిది ఎకరాల స్థలాన్ని తీసుకుంటుందట. ధర ఎకరానికి ఇరవై రెండు కోట్లట. ఎవరైనా ఈ మొత్తం పెట్టుబడిగా పెడితే ఎనభై వేల చదరపు అడుగుల స్థలం వారి వాటాగా వస్తుందట. దీన్ని బట్టి, ఫ్లాట్ ధర చదరపు అడుక్కీ రూ.2750 అవుతుందంట. కావాలంటే అర ఎకరా, పావు ఎకరా కూడా తీసుకోవచ్చట.
చేతిలో సొమ్ము లేకున్నా.. జనాల సొమ్ముతో వ్యాపారం చేయాలని భావించే దగుల్బాజీలు.. హైదరాబాద్ మార్కెట్లో అధికమయ్యారు. ఇలాంటి మోసపూరిత స్కీముల్ని పెట్టి.. ప్రజల్నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి.. వారి నెత్తి మీద శఠగోపం పెట్టడానికే కదా! అసలు ప్రజల వద్ద సొమ్ము తీసుకుని.. వీళ్లను అపార్టుమెంట్లను కట్టమని ఎవరంటున్నారు? వీళ్లు కట్టకపోతే ఔత్సాహిక కొనుగోలుదారులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని బెదిరిస్తున్నారా? అసలిలాంటి చెత్తనాయాళ్లు రియల్ మార్కెట్లోకి రావడం వల్లే.. హైదరాబాద్ నిర్మాణ రంగం భ్రష్టుపట్టిపోయింది. ప్రజల సొమ్ముతో జల్సాలు చేయాలని భావించే ఇలాంటి మోసగాళ్లను ఔత్సాహిక కొనుగోలుదారులు ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదు.