కింగ్ జాన్సన్ కొయ్యడ:
కొంపల్లిలో చదరపు అడుక్కీ 1800.. మదీనాగూడలో 2,400..
బౌరంపేట్‌లో రూ.2,499.. కొల్లూరులో 3,000.. కోకాపేట్‌లో రూ.4,000…
ఈ రేట్లకు ఎవరైనా ఫ్లాట్లు అమ్మితే ఎంత బాగుంటుంది కదూ? ఎగిరి గంతేసి కొనుక్కోవచ్చు. కాకపోతే, పెరిగిన ధరల నేపథ్యంలో ఇది సాధ్యమయ్యే పనేనా? కాదు అని మనలో చాలామందికి తెలుసు. కాకపోతే, ఎవరైనా తక్కువకు విక్రయించకపోతారా? అని వెతుకుతుంటారు. ఎక్కడైనా ధర తగ్గించి అమ్మకపోతారా? అని ఆరా తీస్తుంటారు. ఇలా, మధ్యతరగతి ప్రజల ఆలోచనల్ని ఆసరాగా చేసుకుని.. కొందరు అక్రమార్కులు రియల్ ఎస్టేట్ రంగంలో పడి దోచుకుంటున్నారు. ఇందులో చోటామోటా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, రియల్టర్ల నుంచి బడా బిల్డర్లు ఉన్నారు.
హైదరాబాద్‌లో రియల్ రంగాన్ని క్షుణ్నంగా గమనిస్తే.. కొందరు బిల్డర్లు నిత్యం అపార్టుమెంట్లను కడుతుంటారు. మరికొందరేమో కేవలం లేఅవుట్లనే అభివృద్ధి చేస్తుంటారు. అయితే, మార్కెట్ మెరుగ్గా ఉందనే ఉద్దేశ్యంతో కొందరు చోటామోటా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, రియల్టర్లతో పాటు పలువురు బిల్డర్లు కలిసి సరికొత్త దందాకు శ్రీకారం చుట్టారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ స్థలాల్ని చూడటం.. ఆయా స్థల యజమానికి పది శాతం అడ్వాన్సు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడం..ఆ స్థలాన్ని యూడీఎస్ లేదా ప్రీలాంచులో ఫ్లాట్లుగా చేసి విక్రయించడం.. మిగతా 90 శాతం సొమ్ముని స్థల యజమానికి కట్టేయడం వంటివి చేస్తున్నారు. కొన్నవారి నుంచి వసూలు చేసిన సొమ్మును స్థల యజమానికి కట్టేస్తే ఎలా? అపార్టుమెంట్లను ఎప్పుడు కడతారు? ఎలా కడతారు?
యూడీఎస్, ప్రీలాంచ్ బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. ప్రజల్నుంచి వసూలు చేసిన సొమ్ములో అధికశాతాన్ని స్థలయజమానికి కట్టేస్తున్నారు. మిగతా సొమ్ములో లగ్జరీ కార్లు లేదా ఇళ్లను కొనుక్కోవడం, ఇతర ప్రాంతాల్లో స్థలాల్ని కొనడం వంటివి చేస్తున్నారు. అంతేతప్ప, ఆయా సొమ్మును అక్కడ నిర్మాణాల్ని చేపట్టడం కోసం వినియోగించడం లేదు. మిగతా చోట స్థలం కొన్న దగ్గర వచ్చే సొమ్ముతో మొదటి ప్రాజెక్టును చేపట్టే ప్రణాళికల్ని రచిస్తున్నారు. అంటే, రెండో యూడీఎస్ లేదా ప్రీలాంచ్ ప్రాజెక్టులో అనుకున్న స్థాయిలో సొమ్ము వస్తే ఫర్వాలేదు. కానీ, ప్రభుత్వం యూడీఎస్ రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. రెరా అథారిటీ ప్రీ లాంచులో విక్రయించేవారికి ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా విధిస్తుంది. ఇదే జరిగితే మొదటి ప్రాజెక్టులో కొనుగోలుదారులకు ఫ్లాట్లను అందించడం కష్టమవుతుంది. రెండో ప్రాజెక్టులో కొన్నవారికీ అదే జరుగుతుంది. కాబట్టి, ఇలాంటి మోసపూరిత రియల్టర్ల వద్ద యూడీఎస్, ప్రీలాంచుల్లో కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెప్పే కల్లొబొల్లి కబుర్లు వినేసి.. ఫ్లాట్లను ఎట్టి పరిస్థితిలో కొనవద్దు. ఎందుకంటే మీరు కట్టే వంద శాతం సొమ్ములో అతని వాటా కనీసం పది నుంచి పదిహేను శాతం దాకా ఉంటుంది. అంటే, మీరు యాభై లక్షలు కడితే అతనికి ఎంతలేదన్నా రూ.5 లక్షలైనా వస్తుంది. గరిష్ఠంగా 7.5 లక్షలు చేతికొస్తుంది. ఇలా నెలకో ఐదు ఫ్లాట్లను అమ్మగలిగితే సదరు ఏజెంటుకు ఎంతలేదన్నా రూ.25 లక్షల్ని ఆర్జిస్తాడు. అందుకే, చాలామంది ఏజెంట్లు తమ ప్రధాన వృత్తిని మానేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా అవతారం ఎత్తుతున్నారు. నెలకు ఒక్క ఫ్లాటును విక్రయించినా కనీసం ఐదు లక్షలు ఆర్జిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నెల జీతం కంటే హైదరాబాద్‌లోని ఓ సాధారణ ఏజెంటు నెలకు ఎక్కువగా సంపాదిస్తున్నాడు. రూ. 30 నుంచి 40 లక్షల చొప్పున రేటు గల ఫ్లాట్లను నెలకు రెండు అమ్మే ఏజెంట్ల సంఖ్య తక్కువేం కాదు. ఇందులో పది శాతం సొమ్ము లెక్కించినా.. ఏజెంట్లు నెలకు రూ.6 నుంచి 8 లక్షల్ని ఆర్జిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో ఒక డెవలపర్ నెల ఆర్జన కంటే ఇలా అక్రమ రీతిలో ఏజెంట్లే ఎక్కువగా సంపాదిస్తున్నారు.
This website uses cookies.