మారం సతీష్ కుమార్, ఎండీ, మారం కన్‌స్ట్రక్షన్స్: తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం చక్కగా ఊపందుకుంది. వాణిజ్యపరమైన స్థలాలతోపాటు ఇటు నివాస స్థలాలకు స్థిరమైన డిమాండ్ కొనసాగుతోంది. కోవిడ్ కారణంగా రెండు లాక్ డౌన్ లు విధించినా.. రెసిడెన్షియల్ డిమాండ్ మాత్రం తగ్గలేదు. నాణానికి ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు ప్రీలాంచులు, యూడీఎస్ దందా కనిపిస్తోంది. త్వరగా ఎదగాలనే కొంతమంది డెవలపర్ల ఆశ.. కొనుగోలుదారులను నిట్టనిలువునా ముంచేసే పరిస్థితికి తీసుకెళ్తోంది. అధిక రేట్లకు భూములను కొనేసి, అనంతరం స్థలానికి సంబంధించిన అవిభాజ్యపు వాటా (యూడీఎస్) ముందుగానే అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. రెరా నిబంధనలకు ఇది విరుద్ధమైనా డెవలెపర్లు పట్టించుకోవడంలేదు. కొనుగోలుదారులు సైతం తక్కువ రేటుకే ప్లాట్ వస్తుందనే కారణంతో వీరి మాయలో పడి చివరకు మోసపోతున్నారు. చూడటానికి ఈ లావాదేవీలు సక్రమంగానే కనిపించినప్పటికీ.. కొనుగోలుదారులు నష్టపోవడానికే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆ అంశాలేంటో ఓసారి చూద్దాం..
రిజిస్ట్రేషన్, ఇతర చార్జీల ఎగవేత..
ఈ లావాదేవీలు రెసిడెన్షియల్ యూనిట్ అమ్మకానికి సంబంధించినవనే విషయం స్పష్టంగా చెబుతున్నప్పటికీ, భూమి ధరపై ప్రస్తుతం రిజిస్ట్రేషన్, ఇతర చార్జీల ఎగవేతను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ఈ లావాదేవీలు ఖజానాకు భారీ నష్టం కలిగిస్తున్నాయి.
రెరా నిబంధనలను డెవలెపర్లు ఉల్లంఘిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. తద్వారా యూడీఎస్ఎల్ పథకం ద్వారా యూనిట్లను కొనుగోలుచేసినవారి ప్రయోజనాలు సైతం దెబ్బతింటాయి. యూడీఎస్ఎల్ కింద యూనిట్లు కొనుగోలుచేసినవారిని కొనుగోలుదారులుగా కాకుండా భూమి యజమానులుగా పరిగణిస్తారు. ఫలితంగా ఆ ప్రాజెక్టు వైఫల్యం లేదా ఆలస్యానికి డెవలెపర్ తోపాటు వీరు కూడా బాధ్యులవుతారు. అంతేకాకుండా ఇలాంటి సమయాల్లో భారీ జరిమానాలు, జైలుశిక్ష వేసే అవకాశం కూడా ఉంటాయి. ఈ తరహా ప్రాజెక్టుల విషయంలో రెరా అధికారులు ఇప్పటికే తమ అధికారం ఏమిటో చూపిస్తున్నారు.
యూడీఎస్ఎల్ ద్వారా ప్రీలాంచులు చేస్తున్న ప్రాజెక్టులను స్వీయ విధ్వంసక నమూనాగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించిన పర్యావసనాలపై ఈ డెవలెపర్లకు అస్సలు అవగాహనే ఉండటంలేదు. సదరు డెవలెపర్లు పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే యూడీఎస్ఎల్ కింద భూమిని సేకరిస్తున్నారు. అనంతరం సరైన ఆర్థిక వనరులు లేక ప్రాజెక్టులు పూర్తిచేయలేకపోతున్నారు. యూడీఎస్ఎల్ అమ్మకపు ధరలకు, వాస్తవ అమ్మకపు ధరలకు మధ్య హేతుబద్ధీకరణ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. పైగా వీరికి ప్రాజెక్టులకు సంబంధించి సరైన అనుభవం కూడా లేకపోవడంతో బ్యాంకులు కూడా రుణాలివ్వడానికి ముందుకు రావడంలేదు.
ప్రస్తుత పరిస్థితులు మనం కూర్చున్న కొమ్మనే నరుక్కునే చందంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిని నియంత్రించడానికేం చేయాలంటే..
This website uses cookies.