Categories: LATEST UPDATES

దేశంలో జీసీసీల దూకుడు

  • 2025 నాటికి దేశంలో 1900 జీసీసీలు
  • ఆఫీస్ స్పేస్ లో 35 నుంచి 40 శాతం వాటా వాటిదే
  • సీబీఆర్ఈ సౌత్ ఏసియా నివేదిక వెల్లడి

బహుళ జాతి సంస్థల కార్యకలాపాలకు వేదికగా ఉండే అంతర్జాతీయ కార్యకలాపాల సామర్థ్య కేంద్రాలు (జీసీసీ)వేగంగా పెరుగుతాయని, వచ్చే రెండేళ్లగా అవి బాగా వృద్ధి చెందుతాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏసియా పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో 1580 జీసీసీలు ఉండగా.. 2025 నాటికి దేశంలోని అవి 1900కి చేరుకుంటాయని తెలిపింది. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో వాటి వాటా 35 నుంచి 40 శాతంగా ఉంటుందని వివరించింది.

భారత్‌ కాకుండా బ్రెజిల్‌, చైనా, చిలే, చెక్‌ రిపబ్లిక్‌, హంగరీ, ఫిలిప్పీన్స్‌, పోలాండ్‌ సైతం జీసీసీ కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది. అయితే, లీజు వ్యయాల పరంగా, నైపుణ్య మానవ వనరుల పరంగా భారత్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉంటూ, జీసీసీలకు ప్రాధాన్య కేంద్రంగా ఉన్నట్టు వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్య కాలంలో భారత్‌లో జీసీసీల విస్తరణ దూకుడుగా ఉందని, ఆరు పట్టణాల్లో మొత్తం ఆఫీస్‌ లీజులో వీటి వాటా 38 శాతానికి చేరుకుందని తెలిపింది. ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలల్లో జీసీసీల ఆఫీసు లీజు పరిమాణం 9.8 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉన్నట్టు వెల్లడించింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ జీసీసీ ఆఫీస్‌ లీజులో 77 శాతం వాటాను (జనవరి-జూన్‌ మధ్య) కలిగి ఉన్నట్టు పేర్కొంది. ఇందులో 3.8 మిలియన్ చదరపు అడుగుల జీసీసీ లీజింగ్ తో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా.. 2.4 మిలియన్ చదరపు అడుగులతో చెన్నై రెండో స్థానంలో ఉంది. 1.4 మిలియన్ చదరపు అడుగుల జీసీసీ లీజింగ్ తో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. ‘జీసీసీలకు భారత్‌ అత్యంత ప్రాధాన్య కేంద్రంగా మారింది. నైపుణ్య మానవ వనరులు, తక్కువ వ్యయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ మద్దతు వంటి అంశాలు ఇందుకు కారణం. కరోనా సమయంలో జరిగిన రివర్స్ మైగ్రేషన్ తో పలు కంపెనీలు తమ జీసీసీలను టైర్-2 నగరాల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి’ అని సీబీఆర్‌ఈ భారత్‌, ఆగ్నేయాసియా చైర్మన్‌, సీఈవో అన్షుమన్‌ మేగజిన్‌ పేర్కొన్నారు.

This website uses cookies.